Hyderabad Momos Incident : హైదరాబాద్ లో చికెన్ మోమోస్ తిని మహిళ మృతి, 50 మందికి అస్వస్థత
Hyderabad Momos Incident : హైదరాబాద్ లో చికెన్ మోమోస్ తిని 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ మహిళ మృతి చెందింది. మోమోస్ తిన్న వారికి ఫుడ్ పాయిజన్ అయ్యిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ నందినగర్ లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందింది. మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బాధితులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
నందినగర్ వారాంతపు సంతలో చికెన్ మోమోస్ కొనుగోలు చేసి తిన్న వారికి ఫుడ్ పాయిజన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. సింగాడికుంటకు చెందిన ఓ వివాహిత మృతి చెందింది. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమచారం. బాధితులు నగరంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై పోలీసుల విచారణ చేపట్టారు. వారాంతపు సంతలో మెమోస్ పెట్టారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరీ శంకర్ కాలనీలో శుక్రవారం నాడు జరిగిన సంతలో మోమోస్ విక్రయించారు. ఇక్కడ మోమోస్ కొనుగోలు చేసిన సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ బేగం (31), ఆమె పిల్లలు, స్థానికంగా సుమారు 50 మంది వీటిని తిని అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 10 మంది మైనర్లు ఉన్నారు. మోమోస్ తిన్న వారందరికీ శనివారం నుంచి వాంతులు, విరేచనాలు కావడంతో బంజారాహిల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స కోసం చేరారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
మోమోస్ తిన్న రేష్మ బేగం ఆరోగ్యం విషమించడంతో ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందింది. ఈ ఘటనపై బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోమోస్ విక్రయించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మోమోస్‌తో పాటు ఇచ్చిన మయోనైజ్, చట్నీ కలుషితమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ముత్తారం కేజీబీవీలో 53 మంది విద్యార్థినులకు అస్వస్థత
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో 53 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గడ్డి మందు పీల్చడంతో విద్యార్థినులు తీవ్రఅవస్వస్థకు గురికావడంతో వారిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినులు తీవ్రమైన దగ్గు, తలనొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గడ్డి మందు పీల్చడం వల్లే బాలికలకు ఇలా అయ్యిందని కేజీబీవీ నిర్వాహకులు అంటున్నారు. అయితే గడ్డి మందు చల్లాక పిల్లలతో ఆ గడ్డిని పీకించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాలికలు అనారోగ్యానికి గురవ్వడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
కేజీబీవీ బాలికలు పూర్తిస్థాయిలో కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా దవాఖానలో అస్వస్థతకు గురైన బాలికలను మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం పరామర్శించారు. వార్డెన్ సమాచారంతో అస్వస్థతకు గురైన 53 మంది బాలికలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామన్నారు.
అయితే విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలను విచారిస్తున్నామని మంత్రి శ్రీధర్ తెలిపారు. హాస్టల్ సమీపంలోని డంప్ యార్డ్‌ను తరలించాలని అధికారులకు ఆదేశించారు. 53 మంది బాలికల ఆరోగ్యం మెరుగుపడిందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేజీబీవీ పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని మంత్రి తెలిపారు.
సంబంధిత కథనం