TS Assembly Elections : షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు- సీఈవో వికాస్ రాజ్
TS Assembly Elections : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. వచ్చే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో మూడ్రోజుల పాటు పర్యటిస్తుందని వెల్లడించారు.
TS Assembly Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. బీఆర్కే భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామన్నారు. అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటించి ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేస్తుందన్నారు. ఇప్పటికే వివిధ పార్టీల రాజకీయ నేతలతో ఎన్నికల సంఘం సమావేశం అవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో కూడా ఎన్నికల సంఘం సమావేశం అవుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారులకు కూడా ఈవీఎంల పట్ల అవగాహన పెంచుతున్నట్లు వికాస్ రాజ్ స్పష్టం చేశారు
ట్రెండింగ్ వార్తలు
15 లక్షల కొత్త ఓటర్లు
తెలంగాణలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 15 లక్షల మంది కొత్త ఓటర్లను జాబితాలో చేర్చినట్లు సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు. 3 లక్షలకు పైగా ఓట్లు రద్దయ్యాయని చెప్పారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. ఫారం 6, 8లు 15 వేలకు పైగా వచ్చాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అడ్రస్ మార్పునకు ఫిర్యాదులు అధికంగా అందాయని వాటన్నింటిపై త్వరలో చర్యలు తీసుకుంటామని వికాస్ రాజ్ తెలియజేశారు.
రెండు, మూడు నెలల్లో ఎన్నికలు
ఎన్నికలకు మరో రెండు మూడు నెలలు మాత్రమే ఉందని వికాస్ రాజ్ తెలిపారు. మహిళా ఓటర్ల సంఖ్య పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణ ఎన్నికల నిర్వహణ చాలా పారదర్శకంగా జరుగుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర పరిధిలో 20 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు పనిచేయబోతున్నాయన్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నామని సీఈవో తెలిపారు. చాలా సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే నాలుగు వేల భవనాలు గుర్తించామన్నారు.
మూడ్రోజుల పాటు ఈసీ బృందం పర్యటన
"అక్టోబర్ 3 నుంచి మూడ్రోజుల పాటు హైదరాబాద్‌లో ఈసీ బృందం పర్యటించనుంది. అక్టోబర్ 3న ఎన్నికల నిర్వహణతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో భేటీ కానుంది. అదేవిధంగా ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా, తదితర నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో సమావేశం కానుంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే డబ్బు, మద్యం, ఉచిత కానుకల ప్రవాహాన్ని అడ్డుకునేందుకు తీసుకునే చర్యలపై చర్చించనుంది. ఈసీ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల అధికారులతో సమావేశమై భద్రతా పరమైన ఏర్పాట్లపై సమీక్షించనుంది. ఈసీ బృందం రెండో రోజు(అక్టోబర్ 4) పర్యటనలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమావేశం కానుంది. జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనుంది. అక్టోబర్ 5న కేంద్ర ఎన్నికల సంఘం బృందం తెలంగాణ సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. అలాగే ఓటర్ల జాబితా, ఓటర్లకు అవగాహన, ప్రచార కార్యక్రమాల నిర్వహణ నేపథ్యంలో ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతోనూ కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశం కానుంది" అని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ ఇటీవల తెలిపారు.