Hyderabad Book Fair : పుస్తక ప్రియులకు శుభవార్త.. ఈసారి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రత్యేకతలు ఇవే!
Hyderabad Book Fair : హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 19వ తేదీ నుంచి బుక్ ఫెయిర్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈసారి ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేయిర్ ఉంటుందని సొసైటీ సభ్యులు వివరించారు. ఈసారి బుక్ ఫేయిర్‌కు చాలా ప్రత్యేకలు ఉన్నాయి.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ 37 ఏళ్లుగా కొనసాగుతుంది. తాజాగా.. బుక్ ఫెయిర్‌ను ఈ ఏడాది డిసెంబరు 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బుక్ ఫేయిర్ సొసైటీ వివరాలు వెల్లడించింది. పుస్తక ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేయాలనుకునే వారు ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
హైదరాబాద్‌లో చాలామంది ఎదురుచూసే వాటిలో ఈ పుస్తక ప్రదర్శన ఒకటని సొసైటీ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. దీనికోసమే జిల్లాల నుంచి వచ్చేవారూ ఉన్నారని, ఈసారి కేంద్ర సాహిత్య అకాడమీ భాగస్వామ్యం అవుతోందని వివరించారు. పుస్తక ప్రదర్శన ప్రతిష్ఠ పెంచేలా చూడాలని వ్యాఖ్యానించారు. ఈ రోజుల్లో విద్యార్థులు పుస్తకాలు చదవకపోవడం బాధ కలిగిస్తోందన్నారు.
ఈసారి ప్రత్యేకలు..
గతంలో పుస్తక ప్రదర్శన మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండేది. ఈసారి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించనున్నట్లు సొసైటీ ప్రతినిధులు వెల్లడించారు.
బుక్ ఫేయిర్‌కు వచ్చే వారికి సౌకర్యలు కల్పించారు. గ్రౌండ్‌లోని అన్ని వాహనాలకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించారు. బుక్ ఫేయిర్‌కు వచ్చే వారి కోసం ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు.
బుక్ ఫేయిర్‌కు సంబంధించిన సమాచారం కోసం 9490099081 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు. నేరుగా వెళ్లానుకునే వారు 4-4-1, 1వ అంతస్తు, దిశన్ ప్లాజా, సుల్తాన్ బజార్, హైదరాబాద్ 500095 అడ్రస్‌కు వెళ్లొచ్చు.
మొదటి హైదరాబాద్ బుక్ ఫెయిర్ 1985లో అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగింది. ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతలు ఫెయిర్‌లో పాల్గొన్నారు. పుస్తక ప్రియులు, హైదరాబాద్ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆ తర్వాత నిజాం కాలేజీ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, కేశవ్ మెమోరియల్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో వాటిలో బుక్ ఫెయిర్‌లు జరిగాయి.
గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ గ్రౌండ్స్)లో హైదరాబాద్ బుక్ ఫేయిర్ కొనసాగుతోంది. అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్ బుక్ ఫెయిర్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. 37వ బుక్ ఫెయిర్ కమిటీకి డాక్టర్ యూకుబ్ అధ్యక్షులుగా ఉన్నారు. 14 మంది సొసైటీలో పాలకవర్గం సభ్యులుగా ఉన్నారు.