Chikoti Praveen : చీకోటి ప్రవీణ్ కు షాకిచ్చిన బీజేపీ, చివరి నిమిషంలో చేరికకు బ్రేక్
Chikoti Praveen : క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కు బీజేపీ హ్యాండ్ ఇచ్చింది. అనుచరులతో భారీగా ర్యాలీగా వచ్చిన చీకోటికి బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. పార్టీలో చేరిక వాయిదా వేసింది.
Chikoti Praveen : క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కు బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఇవాళ బీజేపీలో చేరడానికి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి చీకోటి ప్రవీణ్ ర్యాలీగా నాంపల్లి బీజేపీ ఆఫీస్ కు వచ్చారు. అయితే చీకోటి రాకముందే పార్టీ కార్యాలయం నుంచి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెళ్లిపోయారు. మొన్న మాజీమంత్రి కృష్ణ యాదవ్, నేడు చీకోటి హంగు ఆర్భాటంతో వచ్చి ఖంగుతిన్నారు. చీకోటి చేరికను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈరోజు మాజీ మంత్రి చందూలాల్ కొడుకు, ములుగు నేత ప్రహ్లాద్‌ను ఈటల రాజేందర్ పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.
ట్రెండింగ్ వార్తలు
చీకోటి చేరిక వాయిదా
క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ అధిష్టానం నిరాకరించిందని సమాచారం. మంగళవారం బీజేపీలో చేరేందుకు చీకోటి ప్రవీణ్ భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాశ్ జవదేకర్... చీకోటి ప్రవీణ్ చేరిక అంశం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. చీకోటి చేరికను వెంటనే ఆపాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో చీకోటి ప్రవీణ్ పార్టీలో చేరాల్సి ఉంటే... కొన్ని అనివార్య కారణాల వలన కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయానికి రాకపోగా, అప్పటి వరకూ పార్టీ ఆఫీస్ లో ఉన్న ఈటల కూడా బయటకు వెళ్లిపోయారు. దీంతో చీకోటి చేరిక వాయిదా పడింది.
క్యాసినో కేసులో ప్రధాన నిందితుడు
చీకోటి ప్రవీణ్ కర్మాన్‌ఘాట్‌లోని హనుమాన్ టెంపుల్ నుంచి భారీ ర్యాలీగా నాంపల్లి బీజేపీ ఆఫీసుకు చేరుకుని పార్టీలో చేరాల్సి ఉంది. కాసేపట్లో కిషన్‌రెడ్డి సమక్షంలో చీకోటి ప్రవీణ్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనగా, దిల్లీ అధిష్టానం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయి. చీకోటి ప్రవీణ్ పార్టీలో చేరికను తాత్కాలికంగా వాయిదా వేయాలని, ప్రస్తుతం ఎలాంటి చేరిక లేదని స్పష్టం చేశారు. చీకోటి ప్రవీణ్ ఇటీవల దిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. తెలంగాణకు చెందిన బండి సంజయ్, డీకే అరుణ, రాంచందర్ రావును కలిశారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డిలో ఓ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని చీకోటి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన క్యాసినో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చీకోటి ప్రవీణ్ ను పార్టీలో చేర్చుకోవడంపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ అధిష్టానం చీకోటి చేరికకు బ్రేక్ వేసింది.
బండి సంజయ్ అసంతృప్తి
చీకోటి వ్యవహారం బీజేపీ సీనియర్లు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య చిచ్చుపెట్టింది. చీకోటిని పార్టీ కార్యాలయం వరకు రప్పించి చేర్చుకోకపోవడం సరికాదని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. చీకోటి లాంటి కట్టర్ హిందువును పార్టీలో చేర్చుకోకపోతే నష్టమే బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.