Kishan Reddy Vs Harish Rao:కేంద్రం నిధులపై కిషన్ రెడ్డి ప్రజెంటేషన్, గుజరాత్ తో పోలిస్తే ఏమిచ్చారని హరీశ్ రావు కౌంటర్-hyderabad bjp kishan reddy presentation on central funds to telangana minister harish rao counter ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kishan Reddy Vs Harish Rao:కేంద్రం నిధులపై కిషన్ రెడ్డి ప్రజెంటేషన్, గుజరాత్ తో పోలిస్తే ఏమిచ్చారని హరీశ్ రావు కౌంటర్

Kishan Reddy Vs Harish Rao:కేంద్రం నిధులపై కిషన్ రెడ్డి ప్రజెంటేషన్, గుజరాత్ తో పోలిస్తే ఏమిచ్చారని హరీశ్ రావు కౌంటర్

Bandaru Satyaprasad HT Telugu
Jun 17, 2023 10:33 PM IST

Kishan Reddy Vs Harish Rao : తెలంగాణ కేంద్రం అందించిన అప్పులు, నిధులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. గుజరాత్ తో పోలిస్తే తెలంగాణ ఏమిచ్చారని ప్రశ్నించారు.

హరీశ్ రావు, కిషన్ రెడ్డి
హరీశ్ రావు, కిషన్ రెడ్డి

Kishan Reddy Vs Harish Rao : కేంద్రం తెలంగాణకు అందించిన సాయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ‘‘రిపోర్టు టూ పీపుల్‌’’ పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీల ద్వారా ఎంత అప్పులు, నిధులు ఇచ్చారో ప్రజల ముందు పెడుతున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రాలకు సంపూర్ణ సహకారంలో భాగంగా తెలంగాణకు కేంద్రం రూ. 1.78 లక్షల కోట్లు ఇచ్చిందని తెలిపారు. రోడ్ల కోసం రూ.1.08 లక్షల కోట్లు, రైల్వేల కోసం రూ. 32,823 కోట్లు కేటాయించిందన్నారు. 2020 నుంచి 2022 కరోనా కాలంలో ఇచ్చిన రూ.6,950 కోట్ల రుణాన్ని కూడా కేంద్రమే తీరుస్తుదని కిషన్ రెడ్డి తెలిపారు. జీఎస్టీ పరిహారం కింద మొత్తం రూ.15,329 కోట్లు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలకు రూ. 9.26 లక్షల కోట్లు వ్యక్తి గత రుణాలు కేంద్రం ఇచ్చిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

మంత్రి హరీశ్ రావు కౌంటర్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై మంత్రి హరీశ్ రావు స్పందించారు. కిషన్ రెడ్డికి కన్ఫ్యూషన్ ఎక్కువ, కాన్సన్ట్రేషన్ తక్కువ అని ఎద్దేవా చేశారు. ఫ్రస్ట్రేషన్ తో పట్టపగలు పచ్చి అబద్దాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు. అమిత్ షా గతంతో చెప్పిన అబద్ధాలనే కిషన్ రెడ్డి రిపీట్ చేశారన్నారు. రాష్ట్రానికి ఇచ్చే రుణాలు ప్రజలకు బ్యాంకులు ఇచ్చిన వ్యక్తిగత రుణాలను కూడా కిషన్ రెడ్డి కేంద్రం ఖాతాలో వేసుకోవడానికి సిగ్గుండాలన్నారు. జన్ ధన్ ఖాతాల గురించి మాట్లాడుతున్నారు, ప్రారంభించిన వాటిలో 50 శాతానికి పైగా మనుగడలో లేవన్న సంగతి కిషన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. పన్నుల పంపిణీ అనేది రాష్ట్రాల రాజ్యాంగ హక్కు అని హరీశ్ రావు గుర్తుచేశారు. పన్నుల పంపిణీ దేశం కన్సాలిడేటెడ్ ఫండ్‌లో భాగం కాదన్నారు. ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసిన కేంద్ర పన్నుల్లో అన్ని రాష్ట్రాల వాటా 41% ఉన్నప్పటికీ, రాష్ట్రాలు కేంద్ర పన్నుల్లో దాదాపు 30% మాత్రమే పొందుతున్నాయన్నారు. ఎందుకంటే కేంద్రం పన్నుల భాగస్వామ్య పూల్‌లో భాగం కాని సెస్సులు, సర్‌ఛార్జీలు విధిస్తోందన్నారు. పన్నుల పంపిణీలో తెలంగాణ వాటా 2014-15లో 2.893% ఉండగా 2021-22 నాటికి 2.102%కు తగ్గిందని తెలిపారు.

కిషన్ రెడ్డి మాటలు విడ్డూరం

"కేంద్ర వాటాగా రూ.1588.08 కోట్లతో తెలంగాణలో 100% ఇళ్లకు నల్లాల ద్వారా నీటిని సరఫరా చేశామని కిషన్ రెడ్డి అన్నారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మిషన్ భగీరథ కింద రూ 36,000 కోట్లు వెచ్చించి, 100% గృహాలకు నీటి సరఫరా చేసింది .కేంద్రం ఇస్తున్న మొత్తం మిషన్ భగీరథ నిర్వహణకు కూడా సరిపోదు. ఇంత పచ్చిగా కిషన్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తారా? రాబడి, వ్యయ ప్రవాహాల మధ్య అసమతుల్యతలను అధిగమించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా అన్ని రాష్ట్రాలకు అందించే స్వల్పకాలిక సదుపాయమే మార్గాలు, సాధనాలు(వేస్ అండ్ మీన్స్ ). ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించే సదుపాయం. ఈ అడ్వాన్సులపై రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 6 శాతం వడ్డీ రేటును చెల్లించాలి. కేవలం తెలంగాణకే ప్రత్యేకంగా RBI ఏదో చేస్తున్నట్టు కిషన్ రెడ్డి చెప్పడం విడ్డూరం."- మంత్రి హరీశ్ రావు

అది రాష్ట్రాల హక్కు

తెలంగాణలో 2017-18 నుంచి 2022-23 వరకు జీఎస్టీ పరిహారం సెస్‌గా రూ.34,737 కోట్లు వసూలు అయితే... తెలంగాణకు దక్కింది కేవలం రూ. 8,927 కోట్లని మంత్రి హరీశ్ రావు అన్నారు. జీఎస్టీ ప్రవేశపెట్టిన మొదటి రెండేళ్లలో పరిహారంగా వచ్చింది రూ.169 కోట్లే అని తెలిపారు. ఈ రెండేళ్లలో తెలంగాణ నుంచి వసూలైన జీఎస్టీ సెస్ రూ. 10,285 కోట్లని, పరిహారం మొత్తం భారత కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాలేదన్నారు. GST పరిహార నిధి నుంచి వచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారం చెల్లించిందన్న వాదన సరికాదని, అది రాష్ట్రాల హక్కు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(2) ప్రకారం ఐదేళ్ల కాలానికి వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి రూ.2,250 కోట్లు విడుదల చేయాలన్నారు. ఈ చట్టప్రకారం 2019-20, 2020-21, 2022-23 సంవత్సరాలకు ఎటువంటి మొత్తం విడుదల కాలేదని ఆరోపించారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి మా పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఈ మూడేళ్లకు గాను రూ. 1350 కోట్లు ఎలాంటి కారణం లేకుండా నిలుపుదల చేశారన్నారు. దీనికి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

దీంతో బీజేపీ గొప్పతనం ఏముంది?

"రాష్ట్రం నుంచి ఆహార ధాన్యాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం రూ 1.58 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కిషన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం. వాస్తవానికి, ఈ ఖర్చులో ఎక్కువ భాగం PDS కింద ఈ ఆహార ధాన్యాల విక్రయం ద్వారా తిరిగి కేంద్రం తిరిగి రాబట్టుకుంటుంది. అయినా యాసంగిలో ధాన్యం కొనుగోలుకు రైతులను కేంద్రం అరిగోస పెట్టిన విషయాన్ని ఎవరు మరచిపోతారు? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర ప్రజలను నూకలు తినాలని ఉచిత సలహా ఇచ్చి అవహేళన చేయలేదా? రాష్ట్రానికి ఎరువుల సబ్సిడీ రూ. 33వేల కోట్లు ఇస్తున్నట్టు కిషన్ రెడ్డి చెబుతున్నారు. ఈ రాయితీని తెలంగాణలోని రైతులకు కాకుండా తెలంగాణలో ఉన్న ఎరువుల కంపెనీలకు ఇస్తున్నారు. ఎరువుల కంపెనీకి ఇచ్చే సబ్సిడీని తెలంగాణ రైతులకు ఇచ్చే సబ్సిడీగా ఎలా పరిగణిస్తారు?RBI అనేది స్వతంత్ర సంస్థ. ఓవర్ డ్రాఫ్ట్ ఇతర ఆర్థిక విషయాల్లో రిజర్వ్ బ్యాంకు కొన్ని వెసులు బాట్లు ఇవ్వడం సహజం. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే కొన్నిసార్లు తెలంగాణకు ఇచ్చారు. ఏ వెసులుబాటు ఇచ్చినా దానికి వడ్డీ కూడా ఆర్బీఐ వసూలు చేస్తుంది. దీంట్లో బీజేపీ గొప్పతనం ఏముంది?" - మంత్రి హరీశ్ రావు

ఇచ్చేది గోరంత ప్రచారం కొండంత

కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి లేని గొప్పలు చెప్పుకోవడానికి తిప్పలు పడుతున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బీబీనగర్ ఎయిమ్స్ కు నామమాత్రంగా నిధులు విడుదల చేసి నత్త కూడా సిగ్గు పడేలా పనులు జరుగుతుంటే కిషన్ రెడ్డి కేంద్రం గొప్పతనమని చెప్పుకుంటారా? ఆయుష్మాన్ కింద ఇచ్చేది గోరంత ఆరోగ్యశ్రీ కింద మేమిచ్చేది కొండంత? రాష్ట్రానికి రావలసిన బకాయిలపై కేంద్రానికి లేఖలు రాసి అలసిపోయామన్నారు. ముందు వాటిని కిషన్ రెడ్డి ఇప్పించాలని హితవు పలికారు. గుజరాత్ తో పోలిస్తే తెలంగాణకు ఏమిచ్చారో అని ప్రశ్నించారు. ఫైనాన్స్ కమిషన్ చెప్పినా రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ. 723 కోట్ల పరిహారాన్ని మూడేండ్ల నుంచి అడుగుతున్నా కేంద్రం ఎందుకు ఇవ్వడంలేదన్నారు. ఏపీ ఖాతాలో పొరపాటున జమ అయిన రూ.495 కోట్లు తొమ్మిదేళ్ల నుంచి అడుగుతున్నా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కిషన్ రెడ్డి అబద్దాల పుట్టను త్వరలోనే పూర్తి ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో బద్దలు చేస్తామన్నారు.

Whats_app_banner