Hyderabad: బ్యాంకు అధికారి కక్కుర్తి.. సైబర్ నేరగాళ్లతో దోస్తీ.. సీన్ కట్ చేస్తే..
Hyderabad: రూ.175 కోట్ల భారీ మోసానికి సంబంధించి.. హైదరాబాద్‌లోని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బి) బుధవారం ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో బ్యాంకు ఉద్యోగి సైబర్ నేరగాళ్లతో చేతులు కలపడం కలకలం సృష్టిస్తోంది.
హైదరాబాద్ నగరంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌లో బ్యాంకు అధికారి కూడా ఉండటం కలకలం సృష్టించింది. సదరు బ్యాంకు అధికారిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) ఆఫీసర్లు అరెస్టు చేశారు. ఈ తతంగం అంతా దుబాయ్ నుంచి ఓ వ్యక్తి నడిపించాడని టీజీసీఎస్‌బీ అధికారులు చెబుతున్నారు.
భారీ మొత్తంలో..
హైదరాబాద్‌లోని విజయ్‌నగర్ కాలనీకి చెందిన మహ్మద్ తాఖీర్, కేపీహెచ్‌బీలో జిమ్ నిర్వహించే సందీప్‌శర్మ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. నగరంలో డబ్బు అవసరం ఉండే తోపుడు బండ్ల వ్యాపారులు, రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లను ఎంపిక చేసుకొని భారీ మొత్తంలో డబ్బులు చేతులు మార్చారు.
అన్ని వారి వద్దే..
తాఖీర్, సందీప్ శర్మ.. ఆటో డ్రైవర్లు, రోజువారి కూలీలతో బ్యాంకు ఖాతాలు తెరిపించేవారు. ఆ తర్వాత చెక్‌బుక్‌లు, డెబిట్ కార్డులు తమ వద్దే ఉంచుకునేవారు. వారి ఖాతాల్లో జమయ్యే డబ్బును దుబాయ్‌లో ఉండే ప్రధాన నిందితుడు చెప్పిన ఖాతాకు బదిలీ చేసేవారు. అయితే.. బ్యాంక్ అకౌంట్లు తీసుకున్న వారికి ఈ వ్యవహారం అంతా తెలియదు. వారికి కేవలం కమీషన్ వెళ్లేది.
కరెంట్ అకౌంట్లతో..
తాఖీర్, సందీప్‌శర్మ.. ఫిబ్రవరిలో ఆరుగురు ఆటోడ్రైవర్లు, తోపుడుబండ్ల వ్యాపారుల పేరుతో కరెంట్ అకౌంట్‌లు తెరిచేందుకు షంషీర్‌గంజ్ ఎస్‌బీఐ అధికారిని కలిశారు. సాధారణంగా పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారికే కరెంట్ అకౌంట్‌లు తెరిచేందుకు బ్యాంకులు అనుమతిస్తాయి. కానీ.. ఇక్కడ అతి సాధారణ వ్యక్తులకు కూడా కరెంట్ అకౌంట్ ఇచ్చారు.
ఇరుక్కున్న బ్యాంకు అధికారి..
వారికి కరెంట్ అకౌంట్ ఇవ్వడంలో అప్పటి మేనేజర్ మధుబాబు కీలక పాత్ర పోషించారని టీజీసీఎస్‌బీ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి కరెంట్ అకౌంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాక.. క్షణ్ణంగా పరిశీలించి అనుమతి ఇవ్వాలి. కానీ.. నకిలీ పత్రాలు సమర్పించినా మధుబాబు అనుమతించడంతో.. ఈ వ్యవహారంలో ఆయన కూడా ఇరుక్కున్నారు.
రూ.175 కోట్లు..
సైబర్ నేరగాళ్లు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో సుమారు రూ.175 కోట్లు కాజేశారని టీజీసీఎస్‌బీ అధికారులు వెల్లడించారు. దాదాపు 600 మంది బాధితుల నుంచి కాజేసిన సొమ్మును.. అమాయకుల అకౌంట్లలో వేసి.. వారి నుంచి తమకు కావాల్సిన వారి ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేశారని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి బ్యాంకు అధికారి పాత్ర కీలక ఉందని అనుమానిస్తున్నారు. అతను కమీషన్ కోసం ఇదంతా చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని అంటున్నారు.