AP TS Chicken Rates : తెలుగు రాష్ట్రాల్లో మాంసప్రియులకు బ్యాడ్ న్యూస్. ఏపీ, తెలంగాణలో చికెన్, మటన్ ధరలు కొండెక్కాయి. గత వారం వరకూ రూ.200 ఉన్న కిలో చికెన్... రూ.300లకు చేరుకుంది. ఎండలు ఎక్కువగా ఉండడం, కోళ్ల దాణా ధరలు పెరగడంతో ఉత్పత్తి తగ్గిందని ఫౌల్ట్రీ రైతులు అంటున్నారు. కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్ లో డిమాండ్ పెరిగి, ధరలు భారీగా ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. అయితే పెరిగిన ధరలతో తమకు నష్టమేనని చికెన్ వ్యాపారులు అంటున్నారు. ధరలు పెరగడంతో విక్రయాలు తగ్గుతున్నాయని వాపోతున్నారు. ధరలు అమాంతం పెరగడంతో వినియోగదారులు క్వాంటిటీ తగ్గిస్తున్నారు. కిలో తీసుకునే వాళ్లు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారని వ్యాపారులు అంటున్నారు.
ఏపీ, తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గిందని ఫౌల్ట్రీ వ్యాపారులు అంటున్నారు. ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కోళ్లు భారీగా చనిపోయాయని ఫౌల్ట్రీ రైతులు తెలిపారు. ఏప్రిల్ నెలలో కేజీ చికెన్ ధర రూ.200 నుంచి రూ.250 వరకు నడిచింది. కోళ్ల దాణా ధరలు పెరగడంతో కోళ్లు పెంపకాన్ని తగ్గించారు రైతులు. ఈ కారణాలతో చికెన్ ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. చికెన్ ధరలు రూ.300లకు చేరితో... మటన్ ధరలు మరింత మంట పుట్టిస్తున్నాయి. కొద్ది రోజుల వరకు కిలో రూ.700 పలికిన మటన్ ధర ఇప్పుడు రూ.900 వరకు చేరింది. మండీ మార్కెట్ జీవాల రేట్లు పెంచేయటంతో మటన్ ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. మేకలు, పొట్టేళ్ల ధరలు అమాంతం పెంచేశారని చెబుతున్నారు. చికెన్, మటన్ ధరలు అమాంతం పెరగడంతో వినియోగదారులు ముక్క ముట్టుకోవాలంటే కాస్త ఆలోచిస్తున్నారు. అయితే పెరిగిన ధరలు త్వరలోనే మళ్లీ తగ్గుముఖం పట్టాలని కోరుతున్నారు.
హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో గత వారం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.250 నుంచి రూ.280 వరకు పలికింది. ఇప్పుడు ఈ ధర ఏకంగా రూ. 300కు చేరుకుంది. మరో 15 రోజుల పాటు చికెన్ ధరలు ఇలానే ఉంటాయని మాంసం వ్యాపారులు చెబుతున్నారు. ఎండలు, వాతావరణ మార్పులతో కోళ్ల ఉత్పత్తి తగ్గిందని, దాణా, రవాణా ఖర్చులు కూడా పెరిగాయంటున్నారు. జూన్ వరకు ఈ పరిస్థితి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ ధరలు పెరగడంతో రిటైల్ చికెన్ విక్రయాలు భారీగా పడిపోయాయని వ్యాపారులు తెలిపారు. వినియోగదారులు తగ్గారని, మొన్నటి వరకూ రోజుకు 20 కిలోల విక్రయాలు జరిగేవి ఇప్పుడు 10 కిలోలకు మించడంలేదని ఓ వ్యాపారి తెలిపారు.