CBN Revanth Reddy Meeting : ప్రజాభవన్ లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ- ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారులు వీళ్లే
CBN Revanth Meeting : తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజాభవన్ లో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలువురు అధికారులు, మంత్రులు పాల్గొన్నారు.
CBN Revanth Meeting : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉత్కంఠగా మారింది. విభజన సమస్యలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు చర్చించనున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ ప్రజాభవన్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీలో ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, బీసీ జనార్థన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శితో పాటు పలు శాఖల కార్యదర్శులు, సీనియర్ అధికారులు ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం సలహాదారులు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సీనియర్ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు
పదేళ్లుగా పరిష్కారం కాని సమస్యలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తైంది. అయినా పలు అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. గత పదేళ్లుగా విభజన సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు చర్చలు జరిగాయి. అయినా కొలిక్కి రాలేదు. వీటిపై మరోసారి చర్చించేందుకు శనివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు. ఈ భేటీపై ఇరు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా విభజన సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.
9, 10వ షెడ్యూల్ లోని సంస్థలు
ఏపీ విభజన చట్టం 9వ షెడ్యూల్‌లో పెండింగ్ లో 23 సంస్థల పంపిణీ, 10వ షెడ్యూల్‌లో పెండింగ్‌లో ఉన్న 30సంస్థల పంపిణీపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించనున్నారు. అలాగే షీలా బీడే కమిటీ సిఫార్సులపై చర్చించనున్నారు. అలాగే తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.7,200 కోట్ల విద్యుత్ బకాయిలు, ఏపీఎఫ్సీ అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. దీంతో పాటు ఏపీ, తెలంగాణ మధ్య ఉద్యోగుల బదిలీలు, 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణాల పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చులు చెల్లింపులపై ఈ భేటీలో చర్చించనున్నారు. హైదరాబాద్ లోని మూడు భవనాలను ఏపీకి కేటాయించేందుకు ఈ భేటీలో చర్చించనున్నారు. విభజన సమస్యలతో పలు సంస్థలకు చెందిన రూ.8 వేల కోట్లు రెండు రాష్ట్రాలు వాడుకోలేకపోతున్నాయి. 9వ షెడ్యూల్‌లోని ఏపీ జెన్కో విలువ రూ.2,448కోట్లుగా ఉంది. 10వ షెడ్యూల్‌లోని సంస్థల్లో రూ.2,994 కోట్ల నగదు ఉండగా ఇప్పటికే రూ.1,559 కోట్లను రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి.మిగిలిన రూ.1,435 కోట్ల పంపిణీపై పరస్పర అంగీకారం రావాల్సి ఉంది.
తెలంగాణ డిమాండ్లు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రత్యేక ఆర్డినెన్స్ తో తెలంగాణకు చెందిన 7 ముంపు మండలాలను ఏపీలో కలిపారు. వీటిని తిరిగి తెలంగాణలో చేర్చడం, టీటీడీ పాలకమండలిలో తెలంగాణకు ప్రాధాన్యత, అలాగే దర్శనాల్లో ప్రత్యేక దర్శనం కోటాపై చర్చించనున్నారు. కృష్ణా జలాల్లోని 811 టీఎంసీల నీటిలో తెలంగాణకు 558 టీఎంసీలు కేటాయింపుపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారు. అలాగే తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీకి చెల్లించాల్సిన రూ.24 వేల కోట్లు బకాయిలు చెల్లింపుపైనా చర్చించనున్నారు. తెలంగాణకు సముద్రతీరం లేనందున ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో ఎగుమతులు, దిగుమతుల్లో కోటా ఇవ్వాలనే డిమాండ్‌పై చర్చించే అవకాశం ఉంది.
సంబంధిత కథనం