Anand Mahindra : తెలంగాణ స్కిల్ వర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన-hyderabad anand mahindra became chairman to telangana skill university says cm revanth reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Anand Mahindra : తెలంగాణ స్కిల్ వర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

Anand Mahindra : తెలంగాణ స్కిల్ వర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

Bandaru Satyaprasad HT Telugu
Aug 05, 2024 10:14 PM IST

Anand Mahindra : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్కిల్ యూనివర్సిటీకి ఛైర్మన్ గా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

తెలంగాణ స్కిల్ వర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
తెలంగాణ స్కిల్ వర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

Anand Mahindra : తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన 'తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ'కి ఛైర్మన్‌గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించడానికి ఆనంద్ మహీంద్రా అంగీకరించారని, కొద్ది రోజుల్లోనే వారు బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.

తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగినవారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అంతర్జాతీయంగా పేరున్న వ్యక్తిని అధినేతగా నియమిస్తామని ముఖ్యమంత్రి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. ఆనంద్ మహీంద్రా ఇటీవల హైదరాబాద్ లో ముఖ్యమంత్రితో సమావేశమైన సందర్భంలోనూ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీపై చర్చలు జరిపారు.

17 కోర్సుల్లో 20 వేల మందికి శిక్షణ

రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ పరిధిలో బ్యాగరికంచె వద్ద తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి గతవారం శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీలో 17 రకాల కోర్సుల్లో ఏటా 20 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్ ఇవ్వడంతోపాటు ఆయా కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించే ఏర్పాటు చేశారు. రాబోయే సంవత్సరాల్లో ఏడాదికి లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా స్కిల్ వర్సిటీని విస్తరించనున్నారు. బ్యాగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI) భవంతి నుంచి స్కిల్‌ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

స్కిల్ యూనివర్సిటీ కోసం మొత్తం 57 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. రూ.100 కోట్ల నిధులను సైతం విడుదల చేశారు. వచ్చే ఏడాది వర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం 17 కోర్సులను అందుబాటులోకి తీసుకురానునట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

సీఎం రేవంత్ రెడ్డి, ఆనంద్ మహీంద్రా భేటీ

ఇటీవల మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించి ముఖ్యమంత్రి తన అభిప్రాయాలు ఆనంద్ మహీంద్రాతో పంచుకున్నారు. ఆనంద్ మహీంద్రా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ డిపార్ట్‌మెంట్‌ను దత్తత తీసుకోవడానికి అంగీకరించారు. త్వరలో అధ్యయనం కోసం ఒక బృందాన్ని పంపే ప్రణాళికలను ప్రకటించారు. హైదరాబాద్‌లోని క్లబ్ మహీంద్రా హాలిడే రిసార్ట్ విస్తరణకు కూడా ఆనంద్ మహీంద్రా మద్దతు తెలిపారు.

సంబంధిత కథనం