Rahul Gandhi : కుల గణన కుల వివక్షకు ఎక్స్ రే, రిజర్వేషన్లలో 50 శాతం నిబంధన ఎత్తివేస్తాం- రాహుల్ గాంధీ-hyderabad aicc leader rahul gandhi says caste census x ray to caste discrimination ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rahul Gandhi : కుల గణన కుల వివక్షకు ఎక్స్ రే, రిజర్వేషన్లలో 50 శాతం నిబంధన ఎత్తివేస్తాం- రాహుల్ గాంధీ

Rahul Gandhi : కుల గణన కుల వివక్షకు ఎక్స్ రే, రిజర్వేషన్లలో 50 శాతం నిబంధన ఎత్తివేస్తాం- రాహుల్ గాంధీ

Bandaru Satyaprasad HT Telugu
Nov 05, 2024 07:52 PM IST

Rahul Gandhi : దేశంలో కులవివక్ష అనుభవించే వాళ్లకే ఆ బాధ తెలుస్తుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ కుల గణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కులగణనన ద్వారా వ్యవస్థలను సరిచేయొచ్చన్నారు.

కుల గణన కుల వివక్షకు ఎక్స్ రే, రిజర్వేషన్లలో 50 శాతం నిబంధన ఎత్తివేస్తాం- రాహుల్ గాంధీ
కుల గణన కుల వివక్షకు ఎక్స్ రే, రిజర్వేషన్లలో 50 శాతం నిబంధన ఎత్తివేస్తాం- రాహుల్ గాంధీ

కుల గణన.. కుల వివక్ష అనే వ్యాధి గురించి తెలుసుకునే పరీక్షలాంటిదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్ లోని బోయినపల్లిలో నిర్వహించిన కుల గణన సంప్రదింపుల వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టైటానిక్ పడవను తయారు చేసిన వాళ్లు ఈ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది.. ఇది ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారన్నారు. కానీ సముద్రంలో ఒక మంచు కొండను ఢీ కొని 20 నిమిషాలలో మునిగిపోయిందన్నారు. సముద్రంలో ఆ మంచు కొండ 10 శాతం మాత్రమే బయటకు కనిపించింది. మిగతా అంత లోతుగా ఉందని, అది తెలియక దాన్ని ఢీకొట్టి టైటానిక్ కుప్ప కూలిందన్నారు. అలాగే నేడు సమాజంలో కుల వివక్ష కూడా లోతుగా బలంగా ఉందన్నారు. దేశంలో కుల వివక్ష అనుభవించే వాళ్లకు ఆ బాధ తెలుస్తుందన్నారు.

కుల వివక్ష వ్యాధికి పరీక్షలు

"మేము దేశంలో కుల వివక్ష అనే వ్యాధి గురించి తెలుసుకునేందుకు పరీక్షలు చేయాలని అనుకుంటున్నాం. అందుకే కుల గణన అనేది అత్యంత కీలకం. కులగణన చేస్తే ఏ కులం వాళ్లు ఎంత మంది ఉన్నారు. ఎవరు పేదలు, ఎవరికి ఏముంది అని తెలుస్తుంది. ఏదైనా వ్యాధి తెలియాలంటే ఎక్స్ రే చేయాలి కదా..

మేము కుల గణన చేస్తాం. ఎవరికి ఏముందో తెలుసుకుందాం అంటే ప్రధాని మోడీ ఎందుకు అడ్డుగా మాట్లాడుతున్నారు. మేము దేశాన్ని చీల్చాలని ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. దేశంలో సంపదను ఎవరి వాటా వారికి ఇవ్వడం దేశాన్ని చీల్చడమా. దేశవ్యాప్తంగా కుల గణన చేసి వారి జనాభా తగ్గట్టు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించాం." -రాహుల్ గాంధీ

తెలంగాణలో కుల గణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కుల గణన చేపట్టడానికి ప్రశ్నలు తయారు చేయవద్దన్నారు. ప్రజల నుంచి వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రశ్నలు తయారు చేయాలని సూచించారు. తెలంగాణ కుల గణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మన దేశంలో కుల వివక్ష ఉందని సర్వేల్లో తెలుస్తుందన్నారు. వివక్ష తొలగించి అందరికీ సమానంగా జాతి సంపద అందించేందుకు కృషి చేస్తామన్నారు.

కుల గణనకు వ్యతిరేకమంటే కులవివక్షకు అనుకూలమే

"కుల వివక్ష అగ్రవర్ణాలలో లేదు. భారత రాజ్యాంగానికి కులవివక్ష వల్ల ముప్పు. కులగణనన ద్వారా వ్యవస్థలను సరిచేయొచ్చు. అన్ని చోట్ల కులవివక్ష ఉంది. రాజకీయ, న్యాయ, కార్పొరేట్ వ్యవస్థల్లో కూడా ఉంది. ఆత్మవిశ్వాసాన్ని కులవివక్ష దెబ్బ తీస్తుంది. కులవివక్ష ఉందని ఒప్పుకోవాలి. కులగణన చేయమన్నందుకూ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నామని బీజేపీ, మోదీ అంటున్నారు.నిజం చెప్పడం విభజించడమా? కులగణనతో ఎంత మంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు ఉన్నారో తేలుతుంది. దాని ద్వారా నిధులను పంచుతాం. కార్పొరేట్ ఇండియాలో ఎంత మంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీ లు ఉన్నారు? కులగణనకు వ్యతిరేకంగా ఉన్నారంటే కులవివక్షకు అనుకూలంగా ఉన్నవారే. ప్రధాని ఒక్కసారి కూడా కులవివక్ష గురించి మాట్లాడలేదు. ఎందుకు కులగణనకు మోడీ భయపడుతున్నారు"- రాహుల్ గాంధీ

జాతీయ స్థాయిలో కులగణనన చేస్తామని పార్లమెంట్ లో చెప్పానని రాహుల్ గాంధీ తెలిపారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దన్న నిబంధనను ఎత్తి వేస్తామన్నారు. బ్యూరోకటిక్ కులగణనన వద్దు...పేదల కోణంలో కులగణన జరగాలన్నారు. కులగణన ద్వారా అభివృద్ధికి మార్గం ఏర్పడుతుందని తెలిపారు. కులవివక్ష లేదని దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు అబద్దాలు చెప్పలేనన్నారు. కులగణననలో కొన్ని పొరపాట్లు జరగొచ్చు..కానీ సరిచేసుకుంటామన్నారు.

Whats_app_banner