ACB Arrested CCS ACP : హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావుకు చెందిన ఇల్లు, హైదరాబాద్, వైజాగ్‌లోని 13 ఇతర ప్రదేశాలపై అవినీతి నిరోధక శాఖ ఏకకాలంలో దాడులు చేసింది. ఈ తనిఖీల్లో లెక్కకు మించి ఆస్తులను ఉమామహేశ్వరరావు కూడగట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ తనిఖీలలో భూములకు సంబంధించి 15 విలువైన పత్రాలు, ఇతర ఆస్తులు, నగదు, బంగారం, వెండి వస్తువులు, ఇతర చరాస్తులు కలిపి దాదాపు రూ. 3.5 కోట్ల ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అనంతరం విచారణ నిమ్మిత్తం ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్టు చేసింది. ఏసీబీ అధికారులు ఉమామహేశ్వరరావును బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆగడాలు ఒక్కొక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరిగా ఏసీబీ అధికారుల వద్ద తమ గోడును మొరపెట్టుకున్నారు. తాజాగా ఓ బాధితుడు ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నంలో ఉమామహేశ్వరరావు ఏసీపీగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసుల్లో నిందితులపై చర్యలు తీసుకోనేందుకు బాధితుల నుంచి రూ.10 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. తన భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెడితే, ఆ కేసును వెనక్కి తీసుకోవాలని ఏసీపీ ఉమామహేశ్వరరావు బెదిరించారని బాధితుడు శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను బూట్ కాళ్లతో తన్ని, వేధింపులకు గురి చేశారని ఆవేదన చెందారు. తన పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటే రూ.10 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడని బాధితుడు శ్రీనివాస్ ఏసీబీ అధికారుల వద్ద మొరపెట్టుకున్నాడు.
ఉమామహేశ్వరరావు ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన సమయంలో అవినీతికి పాల్పడి భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం సీసీఎస్ ఏసీపీగా ఉన్న ఆయన పలు కేసుల్లో లంచాలు తీసుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. ముడుపులు తీసుకుంటూ బాధితులకు న్యాయం చేయకుండా నిందితులను తప్పించే ప్రయత్నాలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఏసీపీ ఇంట్లో సోదాలు విషయం తెలుసుకున్న బాధితులు అక్కడికి చేరుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్‌ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉన్నారు. ఆయన గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశారు. అప్పటి నుంచి ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం రియల్ ఎస్టేట్ కేసుల్లో ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. ఇబ్రహీంపట్నం రియల్ ఎస్టేట్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావును పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు. గతంలో అవినీతి ఆరోపణలతో పలుమార్లు సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత కూడా తీరు మార్చుకోలేదని చెబుతున్నారు.
సంబంధిత కథనం