Padi Kaushik Reddy : హుజురాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హల్ చల్, దళిత బంధు ఆందోళనలో ఉద్రిక్తత-huzurabad mla padi kaushik reddy protest turns tension mlc got injured when police take into custody ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Padi Kaushik Reddy : హుజురాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హల్ చల్, దళిత బంధు ఆందోళనలో ఉద్రిక్తత

Padi Kaushik Reddy : హుజురాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హల్ చల్, దళిత బంధు ఆందోళనలో ఉద్రిక్తత

HT Telugu Desk HT Telugu
Nov 09, 2024 06:37 PM IST

Padi Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ లో హల్ చల్ చేశారు. దళిత బంధు రెండో విడత నిధులు వెంటనే విడుదల చేయాలని లబ్దిదారులతో కలిసి ఆందోళన చేశారు. ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

హుజురాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హల్ చల్, దళిత బంధు ఆందోళనలో ఉద్రిక్తత
హుజురాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హల్ చల్, దళిత బంధు ఆందోళనలో ఉద్రిక్తత

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏం చేసినా సంచలనమే అవుతుంది. తాజాగా దళిత బంధు రెండో విడత నిధులు వెంటనే విడుదల చేయాలని హుజురాబాద్ లో లబ్ధిదారులతో ఎమ్మెల్యే ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే పరుగెత్తి డప్పు కొట్టి దండోరా వేసి ఆందోళనకు దిగడంతో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. తోపులాటతో ఎమ్మెల్యే చేయి ప్యాక్షర్ కాగ పలువురు దళిత నేతలు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.

బీఆర్ఎస్ కు చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గంలోని దళిత బంధు రెండో విడత లబ్దిదారులు తన ఇంటికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని‌ పిలుపునివ్వడంతో దళితులు పెద్ద సంఖ్యలో హుజురాబాద్ కు చేరుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టకముందే కొంతమంది దళితులు కౌశిక్ రెడ్డిని మీరు మా మా వెంట అంబేడ్కర్ చౌరస్తాకు వచ్చి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం ధర్నా చేసి దరఖాస్తులు స్వీకరణ చేస్తే బాగుంటుందని అన్నారు. దీంతో కౌశిక్ రెడ్డి దళితులతో కలిసి అంబేడ్కర్ చౌరస్తాకు బయలుదేరగా పోలీసులు ధర్నాకు అనుమతి లేదని అడ్డుకున్నారు. పోలీసులు ఎమ్మెల్యేను నిలువరించే ప్రయత్నం చేయగా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పరుగెత్తి అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకుని డప్పు కొట్టి దండోరా వేశారు.

రోడ్డుపై బైఠాయించి ధర్నా

దళిత బంధు రెండో విడత లబ్ధిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంబేడ్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు ఎంత నచ్చజేప్పిన వినకపోవడంతో బలవంతంగా పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా పోలీస్ వాహనం ఎక్కిస్తుండగా తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో ఎమ్మెల్యేతో పాటు పలువురు అస్వస్థతకు గురయ్యారు. మహిళకు గాయాలయ్యాయి.

బలవంతంగా ఎమ్మెల్యేను స్టేషన్ కు తరలించగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో వెంటనే పోలీసులు ఎమ్మెల్యేను హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే చేయి ప్యాక్షర్ అయి ఆసుపత్రిలో ఉండగా దళిత నేతలు పోలీసుల తీరును ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దాదాపు రెండు గంటలపాటు ఆందోళన కొనసాగడంతో కరీంనగర్ వరంగల్ రూట్ లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించి ఆందోళన దిగిన వారిని బలవంతంగా రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

నిరసన తెలిపితే కొడతారా?-కౌశిక్ రెడ్డి

దళిత బంధు రెండో విడత లబ్దిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలని ఆందోళన చేస్తే పోలీసులు అడ్డుకుని ఇష్టం వచ్చిన్నట్లు కొట్టారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. దళితులు మహిళలు అని చూడకుండా ఈడ్చుకెళ్లి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏం తప్పు చేశామని కొట్టారని పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల సమస్యలపై, ప్రజా సమస్యల మీద, న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం ఆందోళన చేస్తే కొడతారా? అని మండిపడ్డారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా చివరకు తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ, దళితులకు ఇవ్వాల్సిన రెండో విడత దళిత బంధు నిధులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.‌

దళిత బంధు రెండో విడత నిధులు ఇచ్చేవరకు తన పోరాటం ఆగదని, దళితుల పక్షాన ఎందాకైనా పోరాడుతానని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దళిత కుటుంబాలకు ఒక్కొ కుటుంబానికి రూ.12 లక్షలు ఇస్తానని చెప్పారని, వెంటనే ప్రతి దళితునికి రూ.12 లక్షలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 20 లోగా దళిత బంధం నిధులు విడుదల చేయకుంటే కాంగ్రెస్ నాయకులను నియోజకవర్గంలో తిరగనివ్వమని రణరంగం సృష్టిస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి కి దమ్ముంటే హుజూరాబాద్ దళిత కాలనీల్లో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు.

కౌశిక్ రెడ్డి పరామర్శించిన గంగుల

దళిత బంధు నిధులకై ఆందోళనకు దిగగా చోటు చేసుకున్న తోపులాటలో అస్వస్థత గురై ఆసుపత్రి పాలైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరామర్శించారు.‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధు లబ్దిదారులందరికీ కేసీఆర్ వారి అకౌంట్లో వేసిన పది లక్షల ఆర్థిక సహాయానికి ఫ్రీజింగ్ ఎత్తివేసి వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తే దాడి చేసి కొడతారా అని ప్రశ్నించారు.

ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇలా దాడి చేయలేదన్నారు. ఎమ్మెల్యేలను రక్షించే బాధ్యత స్పీకర్ దేనని...విచారణ చేయాలని డిమాండ్ చేశారు. గాయాలు అయిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదారాబాద్ పంపించామన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం వల్లే పోలీసులకు ఉద్యోగాలు వచ్చినాయని, దళితులపై, ఎమ్మెల్యేపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. వెంటనే దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని లేనిచో ఆందోళన ఉద్ధృతం చేయక తప్పదని హెచ్చరించారు.

రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ , హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం