హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్ రెడ్డి అనే క్వారీ యాజమానిని బెదిరించినట్లు ఫిర్యాదు అందింది.ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు…. ఇవాళ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కౌశిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై బీఎన్ఎస్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదయ్యాయి.
కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ నుంచి వరంగల్ కు తరలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు రిమాండ్ విధిస్తే జైలుకు తరలించే అవకాశం ఉంది. మరోవైపు కౌశిక్ రెడ్డి తరపున బీఆర్ఎస్ లీగల్ టీమ్ రంగంలోకి దిగింది.
పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ముఖ్యమంత్రి అక్రమాలను, మంత్రుల అవినీతిని, కాంగ్రెస్ నేతల దుర్మార్గాలను అడుగడుగునా కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కాబట్టే ఆయనపై కక్షకట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై నిలదీస్తున్న కౌశిక్ రెడ్డిని తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టే కుట్ర అనేక నెలల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇలాంటి చిల్లర చేష్టలు, పనికిరాని కేసులు, బీఆర్ఎస్ నేతల సంకల్పాన్ని, మనోధైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవు” అని కేటీఆర్ స్పష్టం చేశారు.
“అసమర్ధ ముఖ్యమంత్రి ఆదేశాలతో అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. మాకు గౌరవ న్యాయస్థానాలపై సంపూర్ణ నమ్మకం ఉంది. మాపై, మా నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అవి కోర్టుల్లో నిలబడే అవకాశమే లేదు. ఎన్ని వందల తప్పుడు కేసులు పెట్టినా రేవంత్ నియంత పాలన పై, బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది” అని కేటీఆర్ తెలిపారు.