Hussain Sagar Fire Accident : హుస్సేన్ సాగర్ లో భారీ అగ్నిప్రమాదం- రెండు బోట్లు దగ్ధం, ముగ్గురికి గాయాలు
Hussain Sagar Fire Accident : హుస్సేన్ సాగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచా పేలి రెండు బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద సమయంలో బోట్లలో ఏడుగురు ఉన్నారు. వీరిలో ముగ్గురు గాయపడ్డారు. గవర్నర్, కేంద్రమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో ఇలా అపశృతి చోటుచేసుకుంది.
Hussain Sagar Fire Accident : తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. హుస్సేన్ సాగర్ లో బాణసంచా ఉన్న బోట్లలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బోట్లలో ప్రయాణికులు ఉన్నారు. అయితే వారంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
కిషన్ రెడ్డి కార్యక్రమంలో అపశ్రుతి
నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'భరతమాతకు మహా హారతి' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత బాణసంచా పేల్చేందుకు తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్‌కు చెందిన రెండు బోట్లలో భారీగా బాణా సంచా సామాగ్రిని హుస్సేన్ సాగర్ మధ్యలోకి తీసుకెళ్లారు.
బాణాసంచా బోట్లలో అగ్ని ప్రమాదం
టపాసులు పేలుస్తున్న సమయంలో నిప్పులు బాణాసంచా నిల్వ చేసిన బోట్లపై పడటంతో.. భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో బోట్లలో ఉన్నవారు నీటికి దూకారు. రెండు బోట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రెండు బోట్లలో ఏడుగురు ఉన్నారు. వీరిలో ముగ్గురు గాయపడ్డారు. నలుగురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైర్ ఫైటర్స్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఏడేళ్లుగా భరతమాతకు హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.