Karimangar News: భార్య బాధితులు హల్ చల్… కాపురం కోసం విద్యుత్ టవర్ ఎక్కి ఒకరు, పోలీస్ స్టేషన్ ముందు మరొకరు…
Karimangar News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భార్య బాధితులు రెచ్చిపోయారు. వింత ఆందోళనలకు దిగారు. పెళ్ళాం కోసం ఒకరు విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కితే మరొకరు పెళ్ళాన్ని కాపురానికి పంపించాలని పోలీస్ స్టేషన్ ముందు బీరు బాటిల్ తో గాయం చేసుకున్నాడు. ఇంకొకరు రోడ్డుపై ఎర్రటి ఎండలో అర్థనగ్నంగా బైఠాయించాడు.
Karimangar News: కరీంనగర్‌లో పెళ్ళాం ఎడబాటును తట్టుకోలేక ముగ్గురు మూడు రకాల నిరసనలతో పోలీసులకు చుక్కలు చూపారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భార్య భాదితుల ఆందోళనలు నవ్వుల పాలవుతున్నాయి.
కరీంనగర్‌లో వారం రోజుల్లో ముగ్గురు మద్యం మత్తులో వినూత్న నిరసనలకు దిగి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఈనెల 11న పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం ఎన్టీపీసీ లో కూలీ పని చేసే బీహార్ కు చెందిన అజయ్ హల్ చల్ చేశాడు. భార్య ప్రీతితో గొడవ పడడంతో స్థానికంగా ఉండే బంధువుల వద్దకు ఆమె వెళ్ళిపోయింది.
భార్య ఎడబాటును తట్టుకోలేని అజయ్ మద్యం సేవించి మత్తులో మేడిపల్లి సెంటర్ లోని విద్యుత్ హై టెన్షన్ టవర్ ఎక్కాడు. విద్యుత్ వైర్ల వరకు వెళ్ళి భార్య కావాలని డిమాండ్ చేశాడు. ప్రమాదక పరిస్థితిలో కరెంట్ హై టెన్షన్ వైర్ల వద్దకు వెళ్ళి కాపురానికి దూరమైన భార్యను రప్పించాలని, లేకుంటే కరెంట్ వైర్లు ముట్టుకుంటానని బెదిరించాడు.
హై టెన్షన్ టవర్ పై అజయ్ హల్చల్ తో పోలీసులు స్థానికులు హైరానాకు గురయ్యారు. భార్య వచ్చే వరకు దిగనని స్పష్టం చేయడంతో పోలీసులు వెంటనే కూలీలు ఉండే ప్రాంతానికి చేరుకుని భార్య ప్రీతిని పట్టుకొచ్చారు.
భార్య ను చూసిన అజయ్ ముసి ముసి నవ్వులు నవ్వుతూ టవర్ పై కిందకు దిగాడు. తాగొచ్చి కొట్టడంతోనే భర్తను వదిలేసి పోయానని భార్య ప్రీతి తెలుపడంతో ఇద్దరిని పోలీసులు తమ వాహనంలో స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
జగిత్యాల పిఎస్ ఎదుట బీరు సీసాతో..
జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద యువకుడు శివరాం హడావిడి చేశాడు. పెళ్ళాం కావాలని మద్యం మత్తులో గోల చేశాడు. బీర్ సీసాతో తలపై కొట్టుకుని గాయం చేసుకున్నాడు. రామడుగు మండలానికి చెందిన శివరాం మూడేళ్ల క్రితం జగిత్యాల పట్టణానికి చెందిన మంజుల ను వివాహం చేసుకున్నాడు.
ఓ కేసులో జైలు శిక్ష అనుభవించిన శివరాంతో కాపురం చేయలేనని మంజుల పుట్టింటింటికి వెళ్ళిపోయింది. దీంతో మానసిక ఆందోళనలో ఉన్న శివరాం జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదనతో బీరు బాటిల్ తో హల్ చల్ చేశాడు.
భార్యను కాపురానికి పంపించాలని బీర్ బాటిల్ తో తల పై కొట్టుకుని ఆందోళనకు దిగాడు. పోలీసులు మత్తు వదిలేలా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు.
హుజురాబాద్ లో ఎండలో రోడ్డుపై అర్థనగ్నంగా....
గోదావరిఖని, జగిత్యాల ఘటనలు మరిచిపోకముందే హుజురాబాద్ లో మరో యువకుడు రాజు పెళ్ళాం కోసం వినూత్న ఆందోళనలకు దిగాడు. పోలీస్ స్టేషన్ ముందు ఎర్రటి ఎండలో రోడ్డుపై అర్థనగ్నంగా బైఠాయించాడు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన రాజు భార్య తల్లిగారి ఊరు హుజురాబాద్ కాగా, అత్తమామలు కొట్టి తిట్టి భార్యను తనతో పంపకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. భార్య ను తనతో పంపాలని లేకుంటే చస్తానని సెల్ ఫోన్ తో తల కొట్టుకుంటు హెచ్చరించాడు. దీంతో స్థానికులు పోలీసులు అతన్ని సముదాయించి స్టేషన్ కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
ఆగం చేసిన మద్యం మత్తు...
ముగ్గురిది ఒకే డిమాండ్ పెళ్ళాం కావాలి...భార్యను కాపురానికి పంపించాలని. కానీ ముగ్గురు మద్యం మత్తులోనే అలా ప్రవర్తించారు. తాగిన మైకంలో పెళ్ళాంతో గొడవపడడంతోనే వేగలేక వాళ్ళు అవ్వగారింటికి వెళ్ళి వారి తిక్క కుదిర్చారు. మద్యం మత్తే వారిని అలా ప్రవర్తించేలా చేస్తుందని భావిస్తున్నారు. మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లడం లేదా మద్యం సేవించడం బంద్ చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం