New Mother Killed: కోరిక తీర్చలేదని బాలింతను చంపిన భర్త-husband who killed the new mother for not fulfilling his sexual wish ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Husband Who Killed The New Mother For Not Fulfilling His Sexual Wish

New Mother Killed: కోరిక తీర్చలేదని బాలింతను చంపిన భర్త

HT Telugu Desk HT Telugu
Jun 01, 2023 01:07 PM IST

New Mother Killed: ప్రసవమై నెల కూడా పూర్తి కాని బాలింతను తన కోరిక తీర్చలేదని గొంతు నులిమి హతమార్చిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పోస్టుమార్టం నివేదికలో హత్య విషయం వెలుగు చూసింది.

కోరిక తీర్చలేదని బాలింతను హత్య చేసిన భర్త
కోరిక తీర్చలేదని బాలింతను హత్య చేసిన భర్త

New Mother Killed: కోరిక తీర్చడం లేదని నెలరోజుల బాలింతను భర్త హతమార్చిన ఉదంతం సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. మృతురాలి పోస్టుమార్టం నివేదికతో హత్య విషయం బయటపడింది. నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ట్రెండింగ్ వార్తలు

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని చారుకొండ ప్రాంతం అగ్రహారం తండాకు చెందిన జటావత్‌ తరుణ్‌ అదే గ్రామానికి చెందిన, ఝాన్సీ ప్రేమించుకుని 2021లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాత నగరానికి వచ్చి ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ ఖాజాబాగ్‌లోని మదర్సా అష్రఫ్‌ ఉల్‌ ఉలూం పరిసరాల్లో నివసిస్తున్నారు. తరుణ్‌ ఆటోడ్రైవర్‌‌గా పనిచేస్తున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడున్నాడు. గత ఏప్రిల్‌ 16న ఝాన్సీకి కూతురు పుట్టింది. మే 20న అర్ధరాత్రి భార్యను కోరిక తీర్చాలని తరుణ్‌ కోరాడు. తనకు నీరసంగా ఉందంటూ ఆమె నిరాకరించినా, వినిపించుకోకుండా భర్త బలవంతం చేస్తుండటంతో ఆమె గట్టిగా కేకలు వేయడానికి ప్రయత్నించింది.

దీంతో తరుణ్‌ చేతితో ఆమె తలను మంచంపై అదిమి పెట్టాడు. ముక్కు, నోటి మీద అరచేతిని కొంతసేపు అలాగే ఉంచడంతో ఆమెకు శ్వాస అందలేదు. ఈ క్రమంలో ఝాన్సీ నోటి నుంచి నురగలు వచ్చి అపస్మారకస్థితికి చేరుకుంది. దీంతో కంగారు పడిన తరుణ్ప రిసరాల్లో ఉన్న తమ బంధువులకు విషయం చెప్పడంతో వారంతా కలిసి హుటాహుటిన కంచన్‌బాగ్‌లోని ఒవైసీ ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే ఆమె మృతి చెందిందని నిర్ధారించిన వైద్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి శవపరీక్షకు తరలించారు. ఝాన్సీ తండ్రి నెనావత్‌ రేఖ్యా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ తర్వాత కూడా తరుణ్‌ ఏమీ తెలియనట్లే వ్యవహరించాడు. మంగళవారం పోస్టుమార్టం నివేదిక రావడంతో అసలు విషయం బయటపడింది. తరుణ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఆ రోజు రాత్రి జరిగిన విషయాన్ని వెల్లడించాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తల్లిమృతిచెందడం, తండ్రి జైలుకు వెళ్లడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.

IPL_Entry_Point