Sangareddy Crime: కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను రోకలి బండతో దారుణంగా కొట్టి చంపడమే కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన అత్తపై కూడా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.
సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. జిల్లాలోని పఠాన్ చెరువు మండలంలో ఉన్న పెద్దకంజర్ల గ్రామంలో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. గ్రామస్తులు, కుటుంసభ్యుల సమాచారం ప్రకారం, గ్రామానికి చెందిన రమిలా (25) కు, జిన్నారం మండలంలోని కిస్టాయిపల్లి గ్రామానికి చెందిన సురేష్ (32) తో ఐదు సంవత్సరాల క్రితం ఘనంగా వివాహం జరిగింది. ఈ దంపతులకు, సాత్విక (3) అనే కూతురు కూడా ఉన్నది.
పెళ్లైన మొదటి నాలుగు సంవత్సరాలు అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులకు, ఉప్పు నిప్పుల మారిపోయారు. గత కొంత కాలంగా రమిలా, సురేష్ ల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండటంతో పెద్దమనుషుల వద్ద పలుమార్లు పంచాయతీ కూడా పెట్టారు. అయినా సమస్య సద్దుమణగక పోవటంతో, నెల రోజుల క్రితం రమిలా తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి పెద్దకంజర్ల లోనే ఉంటుంది. గత మంగళవారం రోజు కూడా, పెద్ద మనుషుల వద్ద మరొక సారి పంచాయతీ పెట్టడం జరిగింది. పెద్ద మనుషులు కూడా పంచాయతీ సాల్వ్ చేయలేక పోయారు.
ఈ రోజు రమిలా, తన తల్లి కవిత ఇంటి వద్ద ఉండగా వచ్చిన సురేష్ వారి తో తీవ్ర వాదనకు దిగాడు. తదనంతరం, తీవ్ర ఆవేశం లో రోకలి బండతో రమిలా పైన దాడికి తెగబడ్డారు. అడ్డుకోబోయిన, అత్త కవితను కూడా రోకలి బండతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. తదనంతరం, అక్కడి నుండి సురేష్ పారిపోయాడు. కవిత అరుపులు విన్న, చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే సరికి, రమిలా రక్తపుమడుగులో చనిపోయి ఉన్నది.
తీవ్ర గాయాలపాలైన కవితను వారు అక్కడి నుండి హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. తదనంతరం, గ్రామస్తులు తనను మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది, సంఘటన స్థలానికి చేరుకున్న పఠాన్ చెరువు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సురేష్ కోసం, తన గ్రామంలో, బంధువుల ఇండ్ల వద్ద వెతకటం మొదలు పెట్టారు. ఈ సంఘటన తో, మూడేళ్ళ సాత్విక, తల్లి తండ్రులకు ఇద్దరికీ కూడా దూరం అయ్యింది. తల్లి చనిపోగా, తండ్రి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. సంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న, కవిత పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
సురేష్ ని అరెస్ట్ చేసి, తనకు కఠిన శిక్ష విధించాలని పోలీసులను రమిలా బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా, అనాధ గా మారిన, సాత్వికని ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సంబంధిత కథనం