Hyderabad Crime News : బాచుపల్లిలో దారుణం... భార్యను అతికిరాతకంగా చంపేసిన భర్త - ఆపై ముక్కలు చేయాలనుకుని..!
Wife Murdered by Husband : కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా భర్త చంపేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పరిధిలో వెలుగు చూసింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.
Wife Murdered by Husband in Hyderabad : హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను అతికిరాతకంగా భర్త హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం….. బాచుపల్లిలోని సాయి అనురాగ్ కాలనీలో నాగేంద్ర,మధులత గత కొంత కాలంగా నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాదిన్నర బాబు కూడా ఉన్నాడు. భార్య మధులత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంది.
గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలోనే భర్త నాగేంద్ర… తన భార్యను సుత్తితో బాది,కత్తితో పొడిచి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా చేయాలని ప్రయత్నించాడు. చివరగా గ్యాస్ లీక్ చేసి ప్రమాదంగా చిత్రకరించబోయాడు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మధులత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందుతుడు నాగేంద్ర ను రిమాండ్ కు తరలించారు.
వేధింపులకు గురి చేసేవాడు : కుటుంబసభ్యులు
భర్త నాగేంద్ర…మధులతను తరుచూ వేధింపులకు గురిచేసి కొట్టేవాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.2020లో వీరికి వివాహం జరిగిందని కుటుంబ సభ్యులు చెప్పారు. అత్తమామలు కూడా మధులతను కొట్టేవారిని చెబుతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమార్తెను దారుణంగా హత్య చేసిన నాగేంద్రపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.