TG Mlc Elections: ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు, 32 నామినేషన్ల తిరస్కరణ-huge number of nominations for north telangana graduate mlc elections 32 nominations rejected ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Mlc Elections: ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు, 32 నామినేషన్ల తిరస్కరణ

TG Mlc Elections: ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు, 32 నామినేషన్ల తిరస్కరణ

HT Telugu Desk HT Telugu
Published Feb 12, 2025 07:16 AM IST

TG Mlc Elections: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది నామినేషన్ దాఖలు చేయగా 32 మంది నామినేషన్లు తిరస్కరించారు. టీచర్ల స్థానానికి 17 మంది నామినేషన్ దాఖలు చేయగా ఒకరి నామినేషన్ తిరస్కరించారు.

ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు
ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు

TG Mlc Elections: ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. సరైన ఫార్మాట్ లో నామినేషన్ పత్రాలు నింపక పోవడంతో 32 నామినేషన్లను తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. నామినేషన్ల స్క్రూటీని పూర్తి కావడంతో 12, 13 తేదీల్లో నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంది.

ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్స్ రెండు ఎమ్మెల్సీ నామినేషన్ లో 33 మంది నామినేషన్లు తిరస్కరణకు గురి కావడం కలకలం సృష్టిస్తుంది. పట్టభద్రుల స్థానానికి 100 మంది నామినేషన్ దాఖలు చేశారు.‌ అందులో 32 మంది నామినేషన్లు తిరస్కరించారు. సరైన ఫార్మాట్ లో పూర్తి వివరాలతో దాఖలు చేసిన వాటిని అమోదించామని ఎన్నికల అధికారులు తెలిపారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ నరేందర్ రెడ్డి, బీజేపి అభ్యర్థిగా చిన్నమైల్ అంజిరెడ్డి, బిఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి సర్దార్ రవీందర్ సింగ్, ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ నుంచి లట్టు చంద్రశేఖర్, తెలంగాణ ప్రజాశక్తి పార్టీ నుంచి దొడ్ల వెంకటేశం, విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి బక్క జడ్సన్, ధర్మ సమాజ్ పార్టీ నుంచి మంద జ్యోతి, తెలంగాణ ద్రావిడ ప్రజల పార్టీ నుంచి బొల్లి సుభాష్, నేషనల్ నవ క్రాంతి పార్టీ నుంచి సిలువేరి ఇంద్ర గౌడ్ తో పాటు 58 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సరిగా ఉన్నాయని అధికారులు ప్రకటించారు.

టీచర్స్ స్థానంలో ఒకటి...

కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్ల స్థానంలో ఒకరి నామినేషన్ తిరస్కరించారు. టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి బిజేపి అభ్యర్థిగా మల్క కొమురయ్య, బి ఎస్ పి నుంచి యాటకారి సాయన్న, దళిత్ భోజన పార్టీ నుంచి గవ్వల లక్ష్మి, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తోపాటు 17 మంది నామినేషన్ దాఖలు చేయగా బీజేపీ అభ్యర్థితో పాటు 16 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా ఉన్నాయని ఒకరి నామినేషన్ తిరస్కరించడం జరిగిందని తెలిపారు.

రాత్రి వరకు సాగిన పరిశీలన..

పట్టభద్రుల నియోజకవర్గానికి మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 100 మంది నామినేషన్ వేయడంతో ఉదయం నుంచి రాత్రి వరకు నామినేషన్ల పరిశీలన కొనసాగింది. కలెక్టరేట్ ఆడిటోరియంలో నామినేషన్ వేసిన వారి సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలించారు.

అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించిన సందర్భంలో ఏవైనా లోపాలు ఉంటే గుర్తించి అభ్యర్థులకు షార్ట్ మెమోలు ఇచ్చి సరిచేసుకునేందుకు అవకాశం కల్పించామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కొంతమంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని తెలిపారు.

నియమ నిబంధనలను అనుసరించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరిగిందన్నారు. సరైన ఫార్మాట్లో సమర్పించని నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం నామినేషన్ తీసుకునే తేదీల్లో హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

అభ్యంతరాలు నివృత్తి చేసిన అధికారులు...

నామినేషన్ల పరిశీలన ప్రక్రియ అనంతరం అభ్యర్థుల నుండి అధికారులు అభ్యంతరాలు స్వీకరించారు. తిరస్కరణపై అభ్యంతరం వ్యక్తం చేసిన వారి సందేహాలను నివృత్తి చేశారు. తిరస్కరణకు గల కారణాలను వివరంగా అభ్యర్థులకు తెలియచేశారు. స్క్రూటినీ లో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ రామన్, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్, ఏవో నరేందర్, తహసిల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner