World Economic Forum : దావోస్‌లో తెలంగాణ దూకుడు.. కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగాలు!-huge investments for telangana at davos world economic forum ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  World Economic Forum : దావోస్‌లో తెలంగాణ దూకుడు.. కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగాలు!

World Economic Forum : దావోస్‌లో తెలంగాణ దూకుడు.. కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగాలు!

Basani Shiva Kumar HT Telugu
Jan 23, 2025 02:31 PM IST

World Economic Forum : దావోస్‌లో తెలంగాణ దూకుడు ప్రదర్శిస్తోంది. రూ. 1.32 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. కొత్త ఒప్పందాలతో దాదాపు 46 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇదే అతి పెద్ద రికార్డు. 10 ప్రముఖ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.

దావోస్‌లో రేవంత్ రెడ్డి
దావోస్‌లో రేవంత్ రెడ్డి (CMO)

దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డును నమోదు చేసింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఇప్పటికే.. రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి మూడింతలకు మించిన పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం.

yearly horoscope entry point

ఫ్యూచర్ సిటీ ప్లాన్‌తో..

దావోస్ వేదికపై ఈసారి తెలంగాణ రాష్ట్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం.. దావోస్‌లో వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమివ్వటం.. ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది.

రైజింగ్ విజన్..

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళికలతో.. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణం ఉన్న హైదరాబాద్.. పెట్టుబడుల గమ్యస్థానంగా మరోసారి నిలిచింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు.. ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది.

కీలక ఒప్పందాలు..

దేశ విదేశాలకు చెందిన పేరొందిన పది ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులను సాధించింది. దావోస్‌లో వరుసగా మూడు రోజుల పాటు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం.. రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు.. రాష్ట్రంలో దాదాపు 46 వేల మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.

యువతకు ఉద్యోగాలు..

తెలంగాణ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దావోస్ పర్యటనకు వెళ్లిన రేవంత్ బృందం.. వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. కేవలం బుధవారం ఒక్కరోజే.. రూ.56,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది. రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సన్‌ పెట్రో కెమికల్స్‌‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

మేఘాతో..

రూ.10 వేల కోట్లతో కంట్రోల్‌ ఎస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ఒప్పందం చేసుకుంది. ఇటు మేఘా ఇంజినీరింగ్‌తోనూ ప్రభుత్వం మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇక రూ.500 కోట్లతో స్కై రూట్‌ కంపెనీతో ఒప్పందం జరిగింది. హెచ్‌సీఎల్, యూనీలివర్, విప్రో కంపెనీలతో విస్తరణకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి.

Whats_app_banner