Ts Investments: హైదరాబాద్‌లో వార్నర్ బ్రదర్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు-huge investment for hyderabad setting up of warner bros development center ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Huge Investment For Hyderabad, Setting Up Of Warner Bros Development Center

Ts Investments: హైదరాబాద్‌లో వార్నర్ బ్రదర్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు

HT Telugu Desk HT Telugu
May 18, 2023 06:46 AM IST

Ts Investments: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రాబోతుంది. మీడియా, వినోద రంగంలో తెలంగాణకి భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థ సిద్ధమైంది. హైదరాబాద్ లో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ ముందకు వచ్చింది.

వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రతినిధితో మంత్రి కేటీఆర్
వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రతినిధితో మంత్రి కేటీఆర్

Ts Investments: మీడియా, వినోద రంగంలో తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ మీడియా సంస్థ వార్నర్ బ్రదర్స్ ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ సంసిద్దత తెలిపింది. ఈ సంస్థ ఏర్పాటుతో దాదాపు 1,200 మందికి ఉపాధి లభించనుంది.

ట్రెండింగ్ వార్తలు

మీడియా, వినోద రంగానికి చెందిన ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణలో పెట్టుబడి పెట్టబోతుంది. హెచ్.బి.ఓ, హెచ్.బి.ఓ మ్యాక్స్, సిఎన్ఎన్, టి.ఎల్.సి, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్లుబి, యూరోస్పోర్ట్, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్‌వర్క్, సినిమాక్స్, పోగో, టూన్ కార్ట్, హెచ్.జి.టీవీతో పాటు క్వెస్ట్ వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెలివిజన్, ఫిల్మ్, స్ట్రీమింగ్, కంటెంట్ బ్రాండ్‌లు, ఫ్రాంచైజీ లు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థకు చెందినవి.

గేమింగ్,స్ట్రీమింగ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ రంగంలో భారత మార్కెట్ లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో హైదరాబాద్ లో డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటుచేసేందుకు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ముందుకొచ్చింది.

అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు తో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫైనాన్స్ అలెగ్జాండ్రా కార్టర్‌ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో సంస్థ విస్తరణ ప్రణాళికలపై మంత్రి కేటీఆర్‌తో చర్చించారు. ఇండియాలో తమ మార్కెట్ ను సుస్థిరం చేసుకునే లక్ష్యంతో డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభిస్తున్నామని అలెగ్జాండ్రా తెలిపారు.

ఈ సంస్థ ఏర్పాటు ద్వారా మొదటి సంవత్సరం 1200 మందికి ఉపాధి కల్పిస్తామమని, వ్యాపారం పెరిగేకొద్ది మరింతమందికి అవకాశాలు కల్పిస్తామన్నారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ పెట్టుబడి ప్రకటనపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థకు ప్రభుత్వం తరుపున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

IPL_Entry_Point