Telangana Tourism : అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు.. రామప్ప అభివృద్ధికి భారీగా నిధులు!
Telangana Tourism : రామప్ప.. కాకతీయుల కళా వైభవానికి ప్రతీక. గతంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కానీ.. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామప్పపై ఫోకస్ పెట్టాయి. తాజాగా.. రామప్ప ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి భారీగా నిధులు కేటాయించాయి.
తెలంగాణలోని ప్రముఖ పర్యాటక కేంద్రం రామప్ప ఖ్యాతి.. ఖండాంతరాలు దాటింది. దీంతో పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. రామప్ప అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇటీవల రామప్పను ప్రసాద్ పథకంలో చేర్చారు. దీంతో రామప్ప అభివృద్ధికి నిధులు వస్తున్నాయి.
తాజాగా.. సాస్కీ స్కీం ద్వారా రామప్ప, స్థిరమైన పర్యాటక వలయం అభివృద్ధికి ఇంచెర్లలో ట్రైబల్ విలేజ్, రామప్ప ఐలాండ్, గణపురం కోటగుళ్లు, చెరువు కట్ట సుందరీకరణ కోసం రూ.73.74 కోట్లు మంజూరు అయ్యాయి. దీనికి సంబంధించిన జీవో జారీ అయ్యింది. రామప్ప ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వాలు సంకల్పించింది. దీంతో రామప్ప మరింత అభివృద్ధి చెందనుంది.
మొత్తం మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నిధులతో ఇంచర్లలో ట్రైబల్ విలేజ్ ఏర్పాటు చేయనున్నారు. ఎంట్రన్స్, ఎగ్జిట్ గేమ్ కాంప్లెక్స్, ఇన్ఫర్మేషన్ కౌంటర్, టికెట్ సెక్యూరిటీ బ్లాక్, టూరిస్టు ప్లాజా, ఎగ్జిబిషన్ హాల్, ఫెస్టివల్ గ్రౌండ్, అంపీ థియేటర్, గ్రీన్ రూమ్స్, ఎథ్నో బొటానికల్ గార్డెన్, నర్సరీ స్టాల్స్ వంటి పనులు చేపట్టనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
రామప్ప సరస్సు లోపల ద్వీపం కూడా అభివృద్ధి చెందనుంది. అక్కడ ఏకో కేల్, థీమ్ ప్లాజా, థీమ్ స్కల్ప్చర్, బటర్లీ గార్డెన్, సీలింగ్ మండపం, ట్రెక్కింగ్ ట్రైల్, పాత్‌వే, ఫొటోగ్రఫీ ఫాయింట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మరుగుదొడ్లు, ప్లోటింగ్ జెట్టీ సదుపాయాలు కల్పించనున్నారు.
ఇక గణపురం కోటగుళ్ల ఆలయానికి మహర్దశ రానుంది. అక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా, స్కల్ప్చర్ గార్డెన్, పార్కింగ్ సుందరీకరణ, సీలింగ్ మండపం సుందరీకరణ, సీటింగ్ బెంచీలు, సూచిక బోర్డుల ఏర్పాటు వంటి సదుపాయాలు కల్పించడానికి ప్లాన్ చేస్తున్నారు. గణపురం చెరువు వద్ద ఎంట్రన్స్ గేటు, అడ్మిన్ రెస్టారెంట్ లేక్‌వ్యూ వే, పాదాచారుల మార్గం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లేక్ వ్యూ కాటేజీలు, కట్టపై సీసీ రోడ్లు, ప్లోటింగ్ జెట్టీ, బోటింగ్ పాయింట్ వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.