Ts Formation day: ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సం..భారీ బడ్జెట్‌తో నిర్వహణకు కసరత్తు-huge budget allocation for telanganas emergence day celebrations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Huge Budget Allocation For Telangana's Emergence Day Celebrations

Ts Formation day: ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సం..భారీ బడ్జెట్‌తో నిర్వహణకు కసరత్తు

HT Telugu Desk HT Telugu
May 12, 2023 08:48 AM IST

Ts Formation day: తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించి పదేళ్లు సమీపిస్తున్న వేళ, ఘనంగా దశాబ్ది వేడుకల్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. దాదాపు వెయ్యి కోట్లతో తెలంగాణ దశాబ్ది వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది వేడుకలు
తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది వేడుకలు

Ts Formation day: తెలంగాణ రాష్ట్రం అవతరించి పదో ఏట అడుగు పెట్టబోతోంది. ఉద్యమ దశ నుంచి సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం వరకు ఓ ఎత్తైతే రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిన విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తైన సందర్బంగా దశాబ్ది వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయించున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు వెయ్యి కోట్ల రుపాయల వ్యయంతో తెలంగాణ దశాబ్ది వేడుకల నిర్వహణకు సిద్ధమవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014 జూన్‌ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. వచ్చే నెలలో పదో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది. పదేళ్ల రాష్ట్ర అవతరణను పురస్కరించుకొని జూన్‌ 2 నుంచి పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ జరిగిన ప్రగతిపై విస్తృతంగా ప్రచార కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేసింది. దేశానికి తెలంగాణ తరహాలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అవసరం ఉందనే దానిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్సవాల నిర్వహణతో పాటు జిల్లా, మండల స్థాయుల్లోనూ వేడుకల నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

దశాబ్ది వేడుకల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా తుది కార్యాచరణను రూపొందించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ప్రచారానికి భారీ బడ్జెట్ కేటాయింపు….

రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణలో భాగంగా 2023-24 బడ్జెట్‌లో ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంట్‌కు సుమారు వెయ్యి కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ కేటాయింపులను ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు ఖర్చు చేయాలని సర్కారు భావిస్తోంది. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రెండింటికి ప్రభుత్వ ప్రచారం కలిసి వస్తుందని భావిస్తోంది.

ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందే విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సమాచార శాఖకు కేటాయించిన బడ్జెట్ నాలుగు నెలల్లో ఖర్చు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వం తరపున చేస్తున్న ఖర్చు అనే విమర్శలు కూడా లేకపోలేదు.

తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐ అండ్ పీఆర్ శాఖపై ఏనాడు పెద్దగా దృష్టి పెట్టని ముఖ్యమంత్రి ఇటీవలి కాలంలో రెండు, మూడు సార్లు ఆ శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు అర్థమయ్యే తీరుగా ప్రచారం చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఆ ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఉపయోగపడే విధంగా డిజైన్ చేయాలని సూచించినట్టు తెలుస్తోంది.

ఎన్నికల షెడ్యూలు వచ్చేలోపే విస్తృతంగా ప్రచారం..

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబరులో షెడ్యూలు విడుదల కావొచ్చు. ఈ లోపు ప్రభుత్వం తరుపున ప్రకటనల రూపంలో భారీగా ఖర్చు పెట్టాలని యోచిస్తోంది. ఈ డబ్బును ఎలా ఖర్చు చేయాలి? ఏయే రాష్ట్రాల్లో ఖర్చు చేయాలి? అనే అంశాలపై సీఎం కేసీఆర్ స్వయంగా కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు వస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ప్రభుత్వం నుంచి ప్రకటనలకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయడానికి అవకాశం ఉండదు. షెడ్యూల్ కన్నా ముందే వాటిని ఖర్చు చేయాలని భావిస్తున్నారు.

తొమ్మిదేళ్లలో తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై హోర్డింగ్స్, బస్సులు, ఆటోలపై కాంపెయిన్, సినిమా థియేటర్స్, టీవీ, పేపర్‌లో ప్రకటనలు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ మీద కూడా ప్రకటనలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.తెలంగాణలో 2018 నుంచి ఇప్పటివరకు ఐ అండ్ పీఆర్ శాఖకు పూర్తి స్థాయి కమిషనర్ లేరు. ఇన్‌చార్జిలు మాత్రమే పనిచేశారు. కొద్ది వారాల క్రితమే ఐఏఎస్‌గా ప్రమోషన్ పొందిన అశోక్ రెడ్డిని సమాచార శాఖ కమిషనర్‌గా నియమించారు.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు సిద్దం అవుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా కూడా పబ్లిసిటీకి ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో ఏ విధంగా ప్రచారం చేయాలి, ఏయే సంస్థల సహకారం తీసుకోవాలి, సోషల్ మీడియా ప్రచారం ఎలా నిర్వహించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు.

ప్రజల ముందుకు తెలంగాణ ప్రగతి

మరో ఆరునెలల్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు రానుండడంతో పాటు ప్రత్యేక రాష్ట్రం అవతరించి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతుండటంతో రెండింటిని దృష్టిలో పెట్టుకొని ప్రచార కార్యాచరణకు రూపకల్పన చేశారు.

కాళేశ్వరం, మిషన్‌ భగీరథ సహా పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల కరెంటు, పారిశ్రామికంగా అంతర్జాతీయ గుర్తింపును సాధించడం.. దిగ్గజ ఐటీ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని కొలువుదీరడం.. ప్రైవేటులో ఉద్యోగావకాశాలు పెరగడం, టీఎస్‌పీఎస్సీ సహా వైద్య, పోలీసు శాఖల్లోనూ ఉద్యోగ నియామకాలు చేపట్టడం తదితరాలను ప్రధాన ప్రచారాంశాలుగా పేర్కొనాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణలో బిఆర్‌ఎస్‌ సాధించిన అభివృద్ధిని తెలంగాణ ప్రజలకు చెప్పడానికి దశాబ్ది ఉత్సవాలను ఒక వేదికగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఉత్సవాల్లో అన్ని శాఖలను భాగస్వాములను చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, మహిళలు, పాత్రికేయులు తదితర అన్ని వర్గాలకూ గడిచిన పదేళ్లలో ఏ రకంగా అభివృద్ధిని, సంక్షేమ ఫలాలను అందించారనే కోణంలో కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.

 

IPL_Entry_Point