T Congress Ticket Applications : ఈ సీటు కోసం ఏకంగా 36 దరఖాస్తులు, ఆ రెండు చోట్ల ఒక్కటి మాత్రమే!-huge applications for congress ticket in telangana assembly elections 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  T Congress Ticket Applications : ఈ సీటు కోసం ఏకంగా 36 దరఖాస్తులు, ఆ రెండు చోట్ల ఒక్కటి మాత్రమే!

T Congress Ticket Applications : ఈ సీటు కోసం ఏకంగా 36 దరఖాస్తులు, ఆ రెండు చోట్ల ఒక్కటి మాత్రమే!

Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే పరిశీలన ప్రక్రియ మొదలైంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురికి పైగానే ఆశావాహులు ఉన్నారు. ఇక ఇల్లందు సీటు కోస ఏకంగా 30 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023

Telangana Assembly Elections 2023: రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల జాబితాపై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. ఇక అధికార బీఆర్ఎస్ ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి... ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు గట్టి సవాల్ విసిరింది. రేపోమాపో మిగతా 4 సీట్లను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు ఈ ఎన్నికలను అతిపెద్ద సవాల్ గా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్... రేసు గుర్రాలపై ఫోకస్ పెట్టింది. ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. 119 నియోజకవర్గాల నుంచి వెయ్యి మందికిపైగా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పటికే ఆయా దరఖాస్తులను పరిశీలించే పనిలో ఉంది కాంగ్రెస్ నాయకత్వం. అయితే భారీగా దరఖాస్తులు రావటంతో... అంతిమంగా టికెట్ ఎవరికి రాబోతుందనేది ఉత్కంఠగా మారింది.

భారీగా దరఖాస్తులు....

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం భారీగా దరఖాస్తులు చేసుకున్నారు నేతలు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వెయికి పైగా అప్లికేషన్స్ రావటంతో... టికెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడినట్లు అయింది. ఇందులో చూస్తే కొందరు సీనియర్ నేతలు దరఖాస్తులు చేసుకోకుండా... తమ వారసులతో చేయించారు. పలువురు ముఖ్య నేతలు ఇతర నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే కొందరు నేతలకు హ్యాండించేలా కనిపిస్తోంది. ఫలితంగా పార్టీ తరపున టికెట్ ఎవరికి దక్కుతుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. 50 -70కి పైగా నియోజకవర్గాల్లో పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ... మిగతా స్థానాల్లో తీవ్రమైన పోటీ ఉంది. కొన్ని జిల్లాల్లోని నియోజకవర్గాల్లో చూస్తే... ఒక్క టికెట్ కోసం ముగ్గురు నుంచి నలుగురు నేతలు పోటీ పడుతున్నారు. రిజర్వుడు నియోజకవర్గాలకు భారీగా పోటీ నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఇల్లందులో చూస్తే...36 అప్లికేషన్స్ రావటం ఆసక్తికరంగా మారింది. పరిశీలన ప్రక్రియను త్వరితగతిన ముగించి... వచ్చేనెల రెండో వారంలో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా పోటీ ఉండే నియోజకవర్గాల అభ్యర్థులను చివరి వరకు ఆపే అవకాశాలు ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

కొన్ని నియోజకవర్గాలను చూస్తే… బాన్సువాడలో అత్యధికంగా 11 మంది దరఖాస్తు చేస్తున్నారు. జుక్కల్‌ టికెట్ కోసం నలుగురు అప్లికేషన్ పెట్టారు. ములుగు టికెట్ కోసం సీతక్క.. పినపాక టికెట్ కోసం సీతక్క కుమారుడు సూర్యం దరఖాస్తు చేసుకున్నారు. నాగార్జునసాగర్ టిక్కెట్ కోసం జానారెడ్డి ఇద్దరు కుమారులు రఘువీర్‌రెడ్డి, జైవీర్ రెడ్డి దరఖాస్తు చెయ్యగా.. మిర్యాలగూడ టికెట్ కోసం పెద్దకుమారుడు రఘువీర్‌రెడ్డి మరో దరఖాస్తు చేశారు. ముషీరాబాద్ టికెట్‌ కోసం అంజన్‌కుమార్‌ యాదవ్, కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్ దరఖాస్తు చేశారు. ఎల్బీనగర్‌ నుంచి మధుయాష్కీగౌడ్‌ అప్లికేషన్ పెట్టారు. కోదాడ, హుజూరాబాద్‌ నుంచి సినీ నిర్మాత అప్పిరెడ్డి దరఖాస్తు చేశారు. ఇదే స్థానాలను కోరుతూ ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అర్జీలు పెట్టుకున్నారు. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి కేసీఆర్​ సోదరుడు రంగారావు కుమార్తె రమ్యారావు, ఆమె కుమారుడు రితేష్‌రావు దరఖాస్తు చేశారు. మునుగోడు టికెట్ కోసం కృష్ణారెడ్డి, పున్నా కైలాస్ నేత అప్లికేషన్ పెట్టారు. జనగామ టికెట్ కోసం పొన్నాల, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పోటీ పడుతున్నారు. వరంగల్ పశ్చిమ టికెట్ కోసం రాజేందర్ రెడ్డితో పాటు జంగా రాఘవరెడ్డి కూడా ఆశిస్తున్నారు.

ఒక్కటి మాత్రమే...!

మొత్తం ఎపిసోడ్ లో కొడంగల్, మంథని నియోజకవర్గాల నుంచి మాత్రం ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు అందాయి. ఆయా స్థానాల నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీదర్ బాబు బరిలో ఉండనున్నారు. వీరికి టికెట్ ఖరారైనట్లే చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసేందుకు ఎన్నారైలు చాలా మంది ఆసక్తి కనబరిచారు. ఇదిలా ఉంటే.. పార్టీలోని సీనియర్ నేతలైన జానారెడ్డి, వీహెచ్, గీతారెడ్డి, రేణుకా చౌదరితో పాటు కొందరు నేతలు దరఖాస్తు చేసుకోలేదు. జానారెడ్డి కుమారులు బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో చాలా మంది నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారని తెలుస్తోంది.

మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల వేళ… కాంగ్రెస్ పార్టీ టికెట్ వ్యవహరంలో ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయనేది చూడాలి. ఇక ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు చివర్లో టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుందా..? లేక వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్తారా అనేది ప్రశ్నగానే ఉంది..!