దక్షిణ భారతదేశంలో ఒక్క కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. ఇవి చాలా ప్రత్యేకం అని పెద్దలు చెబుతున్నారు. దీంతో తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రతిరోజూ దాదాపు లక్ష నుంచి లక్షన్నర మంది వరకు భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు.. ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక్కడికి పుష్కరాలకు వచ్చే భక్తులు హెలికాప్టర్‌లో విహరించేందుకు జాయ్‌రైడ్‌లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. నది ఒడ్డున 10 అడుగుల సరస్వతి విగ్రహం, అరచేతుల్లో తాళపత్ర గ్రంథాల నిర్మాణం ఈ పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు (కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి) ఉన్న పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఒక్కటే. ఈ రెండు లింగాలకు నిత్యం అభిషేకించిన నీరు.. గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానంలో కలుస్తుండటంతో.. ఇక్కడి సరస్వతి నదిని అంతర్వాహినిగా పిలుస్తుంటారని పూజారులు చెబుతున్నారు.
సరస్వతి పుష్కరాల ప్రాధాన్యత, కాళేశ్వరం చేరుకునే దారులు, ఇక్కడ భక్తులకు కల్పించే వసతులు, ఘాట్లు ఇతర సమాచారాన్ని తెలుసుకోవడానికి వీలుగా ప్రభుత్వం 'సరస్వతి పుష్కరాలు-2025' యాప్‌ను రూపొందించింది. దీని ద్వారా అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. తెలంగాణ, ఏపీలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులు ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా పుష్కరాలకు వచ్చేవారు.. ముందుగా వరంగల్ చేరుకోవాలి. అక్కడి నుంచి ములుగు రోడ్డు ద్వారా.. మల్లంపల్లి మీదుగా జాకారం రావాలి. జాకారం స్టేజీ దగ్గర లెఫ్ట్ తీసుకొని.. రంగయ్యపల్లి దగ్గర రైట్ తీసుకోవాలి. ఇక నేరుగా వెళ్తే.. మహదేవ్‌పూర్ వస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే నేరుగా కాళేశ్వరం వెళ్లవచ్చు. ఈ రోడ్డు చాలా సౌకర్యంగా ఉంటుంది.
కరీంనగర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలనుకునే భక్తులు.. గర్రెపల్లె, సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథని, దేవరపల్లి మీదుగా.. గారెపల్లి చేరుకోవాలి. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మహదేవ్‌పూర్ వెళ్లవచ్చు. అక్కడి నుంచి నేరుగా పుష్కర ఘాట్ల దగ్గరకు చేరుకోవచ్చు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చేవారికి కూడా ఈ మార్గం సౌకర్యవంతంగా ఉంటుంది.
ఏపీ నుంచి రోడ్డు మార్గం ద్వారా వచ్చే భక్తులు.. ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, సూర్యాపేట మీదుగా చేరుకోవచ్చు. భద్రాచలం నుంచి వచ్చేవారు మణుగూరు, జానంపేట మీదుగా ఏటూరునాగారం చేరుకోవాలి. అక్కడి నుంచి ములుగు మీదుగా జాకారం స్టేజీకి చేరుకొని భూపాలపల్లి, మహదేవ్‌పూర్ వెళ్లవచ్చు. అక్కడి నుంచి ఈజీగా కాళేశ్వరం వెళ్లవచ్చు. ఈ మార్గంలో చాలావరకు దట్టమైన అడవి ఉంటుంది. రాత్రిపూట కంటే పగలు వస్తే మేలు. ఖమ్మం నుంచి వచ్చేవారు కూడా ఈ మార్గంలో చేరుకోవచ్చు. లేదా.. కురవి, మహబూబాబాద్, నర్సంపేట, మల్లంపల్లి మీదుగా రావొచ్చు.
రైళ్ల ద్వారా రావాలనుకునే భక్తులకు వరంగల్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ నుంచి వరంగల్‌కు ప్రతీరోజూ పదుల సంఖ్యలో రైళ్లు ఉంటాయి. ఇక్కడి వస్తే.. హనుమకొండ బస్టాండ్ నుంచి కాళేశ్వరంకు బస్సు సౌకర్యం ఉంటుంది. సౌకర్యవంతంగా పుష్కరాలకు చేరుకోవచ్చు. వరంగల్ కాకుండా.. కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాచలం రోడ్, నెక్కొండ రైల్వే స్టేషన్లలో దిగినా.. కాళేశ్వరం చేరుకునేలా బస్సు సౌకర్యాలు ఉంటాయి. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు.
సంబంధిత కథనం