'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్' ఫిర్యాదులా..? మీ ఫోన్‌లోనే ఇలా కంప్లైంట్‌ చేయండి-how to file indiramma housing scheme complaints or grievance through mobile know these steps ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్' ఫిర్యాదులా..? మీ ఫోన్‌లోనే ఇలా కంప్లైంట్‌ చేయండి

'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్' ఫిర్యాదులా..? మీ ఫోన్‌లోనే ఇలా కంప్లైంట్‌ చేయండి

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. భారీగా అప్లికేషన్లు రాగా… లబ్ధిదారులను విడతల వారీగా ఎంపిక చేస్తున్నారు. అయితే యాప్ సర్వేలో తప్పులు దొర్లటంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలను మీ మొబైల్ ఫోన్ లోనే ప్రాసెస్ చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోంది. ఈ స్కీమ్ కోసం రాష్ట్రవ్యాప్తంగానూ భారీగా దరఖాస్తులు రావటంతో…. అర్హులైన వారిని మాత్రమే గుర్తించి ఎంపిక చేస్తోంది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ గా మొదటి విడత కింద 71 వేల మందికి ఇండ్లను మంజూరు చేసింది. వీరిలో పలువురు ఇళ్ల నిర్మాణాలను కూడా చేపట్టారు. మరోవైపు రెండో విడత కింద పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ కాపీలను అందజేసేందుకు రంగం సిద్ధం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను పట్టాలెక్కించే క్రమంలో ప్రభుత్వం యాప్ సర్వే నిర్వహించింది. దరఖాస్తుదారుల అన్ని వివరాలను ఆన్ లైన్ చేసింది. వీటి ఆధారంగా దరఖాస్తులను 3 కేటగిరిలుగా విభజించింది. సొంత జాగా ఉండి ఇళ్లు లేనివాళ్లను ఎల్ 1 కేటగిరిలో ఉంచగా… ఇక సొంత స్థలం లేనివారని ఎల్‌-2, సొంత ఇల్లు ఉండీ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్‌-3లో చేర్చారు. ఈ కేటగిరీల విభజనలో తమ వివరాలను తప్పుగా నమోదయ్యాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యాప్ సర్వేలో ఏమైనా తప్పులు ఉండటం లేదా…ఇంకేమైనా ఫిర్యాదులు ఉంటే ఆన్ లైన్ లో నేరుగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని గృహ నిర్మాణశాఖ కల్పించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను కూడా తీసుకువచ్చింది. మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే…. మీ చేతిలో ఉండే మొబైల్ ఫోన్ ద్వారానే ఫిర్యాదు చేయవచ్చు. చాలా సింపుల్ గా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అంతేకాదు… ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు.

మొబైల్ ఫోన్ ద్వారా ఇలా చేయండి:

  1. ముందుగా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ వెబ్ సైట్ https://indirammaindlu.telangana.gov.in/ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే Grievance అనే ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ గ్రీవెన్స్ ఎంట్రీ అనే మరో అప్షన్ డిస్ ప్లే అవుతుంది. దీనిపై క్లిక్ చేయాలి.
  3. 'Grievance Entry ' ఆప్షన్ పై నొక్కి ముందుగా మీ మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి. ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంట్రీ చేయగానే మీ అప్లికేషన్ డిస్ ప్లే అవుతుంది. ఇక్కడ మీ ఫిర్యాదులను ఎంట్రీ చేసే అవకాశం ఉంటుంది.
  4. గ్రీవెన్స్ ఎంట్రీ ఫామ్ లో… దరఖాస్తుదారుడి ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  5. ఆ తర్వాత మీ సమస్యకు సంబంధించి 7 ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో మీరు ఏ రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారనే దాన్ని ఎంచుకోవాలి.
  6. ఒక ఆప్షన్ ఎంచుకున్న తర్వాత డిస్క్రిప్షన్ బాక్స్ లో సంక్షిప్తంగా మీ సమస్యను రాయాలి.
  7. చివర్లో సబ్మిట్ చేస్తే మీకు గ్రీవెన్స్ ఐడీ జనరేట్ అవుతుంది. ఈ ఐడీని జాగ్రత్తగా ఉంచుకోవాలి.

ఇక మీరు చేసిన ఫిర్యాదుపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు. ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ వెబ్ సైట్ లోకి వెళ్లి “గ్రీవెన్స్ సెర్చ్ ” అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీ గ్రీవెన్స్ ఐడీ లేదా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి క్లిక్ చేస్తే మీ ఫిర్యాదు యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం