TG Indiramma Housing Scheme : ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇందిరమ్మ ఇంటిని ఎలా నిర్మించుకోవాలి?
TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని గ్రౌండింగ్ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అధికారులను గ్రామాలకు పంపుతోంది. వారు లబ్ధిదారుల వద్దకు వెళ్లి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను వివరించనున్నారు. నిబంధనల ప్రకారం ఇంటిని ఎలా నిర్మించుకోవాలో చెప్పనున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతానికి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను అధికారులు తయారు చేశారు. ఈ జాబితా ఆధారంగా ఇళ్ల గ్రౌండింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. మొదట ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రీ గ్రౌండింగ్ సమావేశాలు నిర్వహించనున్నారు. గ్రామాలకు వెళ్లనున్న అధికారులు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటిని ఎలా నిర్మించుకోవాలి.. నిర్మాణ సామాగ్రి సరఫరా, ఇతర సందేహాలను నివృత్తి చేయనున్నారు.
ప్రాసెస్ ఇలా..
సర్వే సమయంలో చూపిన సొంత స్థలంలోనే లబ్ధిదారుడు ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. మరోచోట కట్టుకుంటామంటే రద్దు చేస్తారు.
ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శికి, వార్డు ఆఫీసర్‌కు సమాచారం ఇవ్వాలి. క్షేత్రస్థాయికి వారు వచ్చి ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. నిర్మాణ స్థలాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు.
కనీసం 400 చదరపు అడుగులు కంటే తక్కువ కాకుండా ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. ముగ్గు పోసే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందదు. పునాది పూర్తయిన తర్వాతే మొదటి విడతలో లక్ష రూపాయలు లబ్ధిదారుడి ఖాతాలో జమ అవుతుంది.
ప్రతి ఇందిరమ్మ ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన కూపన్లను తహసీల్దార్, ఆర్డీవోల ద్వారా అందించనున్నారు.
స్టీలు, సిమెంటు, ఇతర సామాగ్రిని హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకే అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, ఏఈఈలు పర్యటించి.. ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి లబ్ధిదారుడికి జమ చేసే నగదు కోసం సిఫారసు చేస్తారు.
ఏ నియోజకవర్గానికి ఎన్ని..
ప్రభుత్వం మొదటి విడతలో 71 వేల 482 ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో 21 నియోజకవర్గాలకు వెయ్యికిపైగా ఇళ్లను మంజూరు చేయనుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
హుజూర్‌నగర్ నియోజకవర్గం- 2 వేల 528
మంథని- 1,952
బోథ్- 1,538
పరకాల- 1,501
హుస్నాబాద్-1,381
సిర్పూర్- 1,324
దుబ్బాక-1,271
పరిగి-1,264
బెల్లంపల్లి-1,206
జహీరాబాద్-1,205
పెద్దపల్లి-1,198
కోదాడ-1,152
చొప్పదండి-1,121
పినపాక- 1,113
దేవరకొండ- 1,091
ములుగు-1,080
ఆసిఫాబాద్-1,067
కొడంగల్-1,046
అందోలు-1,040
తుంగతుర్తి-1,014
గజ్వేల్- 1,001 ఇళ్లను మంజూరు చేయనున్నారు.