TG Rythu Bharosa Scheme Applications : రైతు భరోసాకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? ఈ ముఖ్య వివరాలు తెలుసుకోండి
Telangana Rythu Bharosa Scheme Updates : రైతు భరోసా స్కీమ్ ను తెలంగాణ ప్రభుత్వం పట్టాలెక్కించింది. ఎకరానికి రూ. 6 వేల నగదును ఈ పథకం కింద అందించనుంది. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి వ్యవసాయశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. కావాల్సిన పత్రాలు, అర్హతల వివరాలను పేర్కొంది.
పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ ను ప్రారంభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అర్హులైన అన్నదాతలకు ఏడాదికి రూ. 12వేల సాయం అందించనుంది. లాంఛనంగా స్కీమ్ ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. కొత్త దరఖాస్తులపై ప్రకటన చేసింది.

అర్హతలు - దరఖాస్తు విధానం ఎలా..?
- రైతు భరోసా స్కీమ్ కింద ఎకరాకు రూ. 12000 పంట పెట్టుబడి సాయం అందిస్తారు.
- భూభారతి(ధరణి)లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే పంట పెట్టుబడి సాయం అందుతుంది.
- వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, అంటే రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో కోల్పోయిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, నాలా కన్వర్షన్ అయిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన భూములు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తించదు.
- ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులవుతారు.
- డీబీటీ (నగదు బదిలీ) పద్ధతిలో రైతు భరోసా సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
- రైతు భరోసా స్కీమ్ కు ఆఫ్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తారు.
- గతంలో రైతుబంధు వచ్చిన రైతులు రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
- పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్, బ్యాంక్ అకౌంట్, అప్లికేషన్ ఫారం జీరాక్స్ లు అందజేయాల్సి ఉంటుంది.
- రైతు భరోసా అకౌంట్ వివరాలను జనవరి 30వ తేదీలోపు మండల వ్యవసాయశాఖ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.
గతంలో ఈ స్కీమ్ ను రైతుబంధు పేరుతో అమలు చేశారు. రూ. 10 వేల నుంచి రూ. 12 వేలకు పెంచిన నేపథ్యంలో… ఎకరా చొప్పున ప్రతి రైతు ఖాతాలో రూ. 6వేలు జమ అవుతాయి. ప్రతి ఏడాదికి రైతు భరోసా కింద కింద రెండుసార్లు పంట పెట్టుబడి సాయం అందుతుంది.
రైతు భరోసా స్కీమ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 20 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఎకరాకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక భూమి లేని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీనవర్గాలను ఆదుకోవడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద ఏటా 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.
సంబంధిత కథనం