TG New Ration Cards : మళ్లీ కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ - రెండు చోట్ల ఇవ్వొచ్చు...! ఈ విషయాలు తెలుసుకోండి
TG New Ration Card Applications: కొత్త రేషన్ కార్డుల జాబితాతో గందరగోళం నెలకొంది. చాలా మంది తమ పేర్లు లేవని వాపోతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. ఎలాంటి అపోహాలకు గురికావొద్దని… గ్రామసభల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పింది.
తెలంగాణలో మరోసారి రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను తీసుకున్నప్పటికీ… వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇటీవలే నిర్వహించిన కుటుంబ సర్వే ఆధారంగా… రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించినట్లు సర్కార్ ప్రకటించింది. ఈ సర్వే ఆధారంగానే…. ప్రాథమిక జాబితాలను సిద్ధం చేసింది. వీటిని పౌరసరఫరాల శాఖ గ్రామాల వారీగా విభజించి… విడుదల చేసింది.

ప్రాథమిక జాబితాలు విడుదల కావటంతో గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమ పేర్లు లేదని పలువురు వాపోతున్నారు. తమకు అన్ని అర్హతలు ఉన్నాయని… అయినా తమ పేర్లు లేదని చెబుతున్నారు. కొత్త రేషన్ కార్డు జాబితాలు రావటంతో ప్రజల్లో అనేక అపొహాలు నెలకొన్నాయి. అయితే వీటిపై సర్కార్ క్లారిటీ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని స్పష్టం చేసింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను జారీ చేస్తామని చెప్పింది.
ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో పేర్లు లేనివారు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి..? ఎప్పట్నుంచి అప్లికేషన్లు స్వీరిస్తారో వంటి పలు అంశాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇక్కడ తెలుసుకోండి….
కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు - ముఖ్యమైన విషయాలు
- తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జనవరి 26వ తేదీ నుంచి ఈ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించనుంది.
- ఇటీవలనే కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇందులో కుటుంబ సర్వే ఆధారంగా నూతన కార్డుల జారీ ఉంటుందని పేర్కొంది.
- గతేడాది చివరల్లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించింది. ఇందులో అనేక వివరాలను సేకరించింది.
- సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా… 6.68 లక్షల కుటుంబాల వివరాలతో కూడిన ప్రాథమిక జాబితాను ప్రభుత్వం ప్రకటిచింది. ఇప్పటికే ఈ జాబితాలు గ్రామాలకు చేరాయి.
- కొత్త రేషన్ కార్డుల ప్రాథమిక జాబితాలతో గ్రామాల్లో రగడ మొదలైంది. తమ పేర్లు లేవంటూ చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
- రేషన్ కార్డు లేనివారి నుంచి కొత్తగా దరఖాస్తులను స్వీకరించనుంది. గ్రామసభల్లో ఈ దరఖాస్తులను స్వీకరిస్తామని సర్కార్ తెలిపింది.
- జనవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించనున్నారు. పట్టణాల్లో వార్డు సభలు ఉంటాయి. వీటిల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించి కొత్త కార్డులను జారీ చేసే అవకాశం ఉంటుంది.
- అంతేకాకుండా ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా కూడా కొత్త రేషన్ కార్డులకు లేదా కొత్త సభ్యుల చేర్పులకై దరఖాస్తులు కూడా స్వీకరించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.
- అర్హులైన వారు మరోసారి గ్రామసభలతో పాటు ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- ఇప్పటికే గతంలో జరిగిన ప్రజాపాలన సదస్సులలో స్వీకరించిన దరఖాస్తుల జాబితాలో అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ పురోగతిలో ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
సంబంధిత కథనం