TG New Ration Cards : కొత్త రేషన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? 10 ముఖ్యమైన అంశాలు-how to apply for a new ration card in telangana 10 important points ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg New Ration Cards : కొత్త రేషన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? 10 ముఖ్యమైన అంశాలు

TG New Ration Cards : కొత్త రేషన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? 10 ముఖ్యమైన అంశాలు

Basani Shiva Kumar HT Telugu
Jan 15, 2025 08:07 AM IST

TG New Ration Cards : సంక్రాంతి తరువాత గ్రామసభలు నిర్వహించి.. రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రస్తుతం కార్డుల్లో పేరు ఉన్న ఒక్కో లబ్ధిదారునికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందజేస్తామని స్పష్టం చేసింది. దీంతో లబ్ధిదారుల్లో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

కొత్త రేషన్ కార్డు
కొత్త రేషన్ కార్డు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. లక్షలాది కుటుంబాలు ఎంతో కాలంగా కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో కొత్త కార్డుల జారీ దిశగా సర్కారు ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది.

2.దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత.. కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు పంపిస్తారు.

3.మండల స్థాయిలో ఎంపీడీవో, యూఎల్‌బీలో మున్సిపల్ కమిషనర్ ఈ ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు.

4.ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శిస్తారు. లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదిస్తారు.

5.ఆహార భద్రత కార్డుల్లో కుటుంబ సభ్యుల చేర్పులు, మార్పులు జరగనున్నాయి. అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు.

6.రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ముందుగా దరఖాస్తు ఫారమ్ నింపాలని అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. దరఖాస్తు ఫారం మీసేవా కేంద్రంలో లేదా మీసేవా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని అంటున్నారు.

7.మీసేవా సర్వీస్ ఫారమ్‌లపై క్లిక్ చేస్తే.. అక్కడ వివిధ విభాగాల ఫారంలు కనిపిస్తాయి. అప్పుడు పౌర సరఫరాల శాఖ ఎంపికపై క్లిక్ చేయాలి.

8.ఆహార భద్రతా కార్డ్ కోసం దరఖాస్తు ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత.. ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

9.దరఖాస్తుదారు పేరు, వయస్సు, లింగం, తండ్రి, పేరు, చిరునామా వివరాలతో సహా.. మొబైల్ నంబర్, అవసరమైన అన్ని సమాచారాన్ని దరఖాస్తు ఫారమ్‌లో పూరించాలి. అర్హత వివరాలు, జిల్లా, ప్రాంతం, కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబం ఆదాయం మొదలైన వివరాలు నమోదు చేయాలి.

10.అన్ని పత్రాలను జతచేసి, దరఖాస్తు ఫారమ్‌ను నిర్ణీత రుసుముతో మీసేవా కేంద్రంలో సమర్పించాలి. అక్నాలిడ్జ్ స్లిప్ తీసుకోవడం మర్చిపోవద్దు. దరఖాస్తు చేయడానికి.. నివాస రుజువు ధ్రువీరకణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్, దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరం ఉంటుందని అధికారులు ప్రాథమికంగా చెప్పారు. దీంట్లో ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేసే అవకాశం కూడా ఉంది.

Whats_app_banner