TG Rythu Bharosa Scheme Survey : సాగు చేయని భూములను ఎలా గుర్తిస్తారో తెలుసా..? ఈ 10 విషయాలు తెలుసుకోండి-how non cultivable lands are identified in rythu bharosa scheme survey know these key points ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Rythu Bharosa Scheme Survey : సాగు చేయని భూములను ఎలా గుర్తిస్తారో తెలుసా..? ఈ 10 విషయాలు తెలుసుకోండి

TG Rythu Bharosa Scheme Survey : సాగు చేయని భూములను ఎలా గుర్తిస్తారో తెలుసా..? ఈ 10 విషయాలు తెలుసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 15, 2025 02:06 PM IST

తెలంగాణలో రైతు భరోసా స్కీమ్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. అయితే సాగు యోగత్య లేని భూములకు పంట పెట్టుబడి సాయం దక్కదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాగు యోగ్యత ఉన్న వాటికే డబ్బులు అందుతాయని పేర్కొంది. అయితే సాగులో లేని భూముల గుర్తింపునకు సర్కార్ కార్యాచరణను సిద్ధం చేసింది.

రైతు భరోసా స్కీమ్
రైతు భరోసా స్కీమ్ (image source istockphoto.com)

తెలంగాణలో రైతు భరోసా స్కీమ్ అమలు కాబోతుంది. ఈనెల 26వ తేదీన ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించటమే కాకుండా… ఇటీవలనే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో స్కీమ్ వర్తింపజేయవద్దని స్పష్టం చేసింది. సాగులో లేని భూములను రైతు భరోసా స్కీమ్ నుంచి పక్కనపెట్టాలని పేర్కొంది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది.

yearly horoscope entry point

సాగు యోగ్యత లేని భూమికి పంట పెట్టుబడి సాయం అందిచమని సర్కార్ క్లియర్ కట్ గా చెప్పేసింది. ఇదే విషయాన్ని మార్గదర్శకాల్లో కూడా పేర్కొంది. సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా కింద.. ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని తెలిపింది. సాగు చేసే ఎన్ని ఎకరాలకైనా రైతు భరోసా దక్కనుంది. అయితే సాగు చేయని భూముల వివరాలను గ్రామ సభల్లో ప్రదర్శించాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు… ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. అయితే సాగులోని భూముల వివరాలను ఎలా గుర్తిస్తారో ఇక్కడ చూడండి….

సాగు చేయని వాటిని ఎలా గుర్తిస్తారు..? ముఖ్య విషయాలు

  1. పంట పెట్టుబడి సాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన స్కీమ్ రైతు భరోసా. ఈ స్కీమ్ కింద.. రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తారు.
  2. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా సాయం అందిస్తారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రతీ ఎకరానికి రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. రైతు భరోసా కింద ఎడాదికి రూ. 12 వేలు జమ చేస్తారు.
  3. వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, అంటే రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో కోల్పోయిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, నాలా కన్వర్షన్ అయిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన భూములు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తించదు.
  4. వ్యవసాయ యోగ్యం కాని భూముల వివరాలకు సంబంధించి... రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించి గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరిస్తారు.
  5. సాగు యోగ్యత లేని భూములను గుర్తించేందుకు ఫీల్డ్​ వెరిఫికేషన్​ టీమ్​లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయి. రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీరాజ్ అధికారులు ఇందులో ఉంటారు. సాగు చేయని భూములను గుర్తిస్తారు.
  6. పంచాయతీ కార్యదర్శి, ఏవోలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫీల్డ్​ వెరిఫికేషన్​ టీమ్​ లీడర్స్​గా ఉంటారు. ఈ బృందంలో రెవెన్యూ విలేజ్ అసిస్టెంట్, ఫీల్డ్​ అసిస్టెంట్​, ఆర్ఏ, ఏఈవోలు సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్​ సారథ్యంలోని డీఏవోలు, ఎంపీడీవోలు తదితర ఉన్నతాధికారులు ఈ బృందాలను పర్యవేక్షిస్తాయి.
  7. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ… నాన్ అగ్రికల్చర్(వ్యవసాయేతర) భూములను గుర్తిస్తారు. సర్వే నెంబర్ల వారీగా వివరాలను సేకరిస్తారు. ఆర్వోఆర్, పట్టాదారు పాస్​పుస్తకాల జాబితాను పరిశీలిస్తారు. భూ భారతి పోర్టల్ నుంచి జాబితా, విలేజ్​ మ్యాప్, శాటిలైట్ మ్యాప్​ల ఆధారంగా పరిశీలిస్తారు. అన్నింటిని బేరీజు వేసి వ్యవసాయ యోగ్యంకాని భూముల జాబితాను రూపొందిస్తారు.
  8. అధికారులు రూపొందించే జాబితాలు తప్పనిసరిగా గ్రామ సభల ముందు పెడుతారు. ఇందులో ఆయా భూముల వివరాలను ప్రదర్శిస్తారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత… గ్రామ సభ ఆమోదముద్ర వేస్తుంది.
  9. గ్రామాల వారీగా జాబితాలను గుర్తించి…వ్యవసాయ యోగ్యంకాని భూముల పట్టికను ఫైనల్ చేస్తారు. ఈ భూములకు రైతు భరోసా ఇవ్వరు.
  10. ఈ క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియ జనవరి 16 నుంచి ప్రారంభం కానుంది. జవరి 25లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి… జనవరి 26 నుంచి రైతు భరోసా స్కీమ్ ను ప్రభుత్వం ప్రారంభించనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం