TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్స్ - నగరంలో దరఖాస్తులు భారీగా, ఖాళీ జాగలు తక్కువగా..!
ఇందిరమ్మ ఇళ్ల సర్వే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ కొనసాగుతోంది. అయితే గ్రామాలతో పోల్చితే.. నగరంలో సొంత స్థలాలు ఉన్న వారు చాలా తక్కువగా ఉన్నారు. ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు గ్రామాల్లో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. ఈ సంక్రాంతిలోపే పూర్తిస్థాయిలో సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది. గ్రామాల్లో సొంత స్థలాలు ఉన్న వారు అత్యధికంగానే ఉంటున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అంతేకాదు.. ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది.
మరోవైపు తొలి విడతలో సొంత స్థలం ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దశలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం తరపున సాయం అందిస్తామని చెప్పింది. ఈ క్రమంలో.. ఈ విడతలో ఖాళీ జాగా ఉన్న వారికే అత్యధికంగా స్కీమ్ కు అర్హత సాధించే అవకాశం కనిపిస్తోంది.
అర్బన్ లో భిన్న పరిస్థితులు..!
ఇందిర్మ ఇళ్ల స్కీమ్ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ లో చూస్తే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ స్కీమ్ కోసం గ్రేటర్ పరిధిలో పది లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే శివారు ప్రాంతాల్లో కొంత మందికి స్థలాలు ఉన్నప్పటికీ… సెంట్రల్ సిటీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జాగలు ఉన్న వారు తక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ సర్వే పూర్తి అయితే… మరికొన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. జిల్లాల్లో సగానికి పైగా సర్వే పూర్తికాగా.. గ్రేటర్ లో మాత్రం… అతి తక్కువ శాతం సర్వే పూర్తయింది.
ఇక వరంగల్ కార్పొరేషన్ తో పాటు ఇతర మున్సిపాలిటీల్లోనూ ఖాళీ స్థలాలు తక్కువగానే ఉంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ప్రధానమంత్రి అవాస్ యోజన స్కీమ్ లో అర్బన్ ఏరియాల్లో నిర్మించే వాటికే ఎక్కువ నిధులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఒక్కో ఇంటికి లక్షా 50 వేల ఫండ్ అందుతుంది. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కానీ అర్బన్ ఏరియాల్లో లక్షలాది దరఖాస్తులు వచ్చినప్పటికీ.. వీరిలో చాలా మందికి సొంత స్థలం లేదు. ఈ క్రమంలో… అర్బన్ ఏరియాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అనుకున్నంత స్థాయిలో జరుగుతుందా..? లేదా…? అనేది ప్రశ్నగా మారే అవకాశం ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ స్కీమ్ కోసం లక్షలాది మంది దరఖాస్తులు చేసుకోగా... ప్రస్తుతం ప్రభుత్వం యాప్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుపుతోంది. సంక్రాంతిలోపే పూర్తి స్థాయిలో సర్వే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలోని సర్వేయర్లు దరఖాస్తుదారుడి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
ఈ సర్వేతో పాటు లబ్ధిదారుల ఎంపిక వరకు ఎలా జరగబోతుందనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. లక్షలాది దరఖాస్తులు రావటంతో అసలైన అర్హుల ఎంపిక ఎలా అనేది అధికారులకు సవాల్ గా మారింది. ఈ క్రమంలోనే సాంకేతికతో కూడా యాప్ సర్వేను చేస్తున్నారు.
సంబంధిత కథనం