TG Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు - 'ఇందిరమ్మ అత్మీయ భరోసా' అర్హుల ఎంపిక ఎలా..? 10 ముఖ్య విషయాలు
TG Indiramma Atmiya Bharosa Scheme Updates : భూమిలేని నిరుపేద కూలీల కోసం తెలంగాణ సర్కార్ సరికొత్త స్కీమ్ ను పట్టాలెక్కించబోతుంది. ఇందిరమ్మ అత్మీయ భరోసా పేరుతో ప్రతి ఏటా రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. అయితే ఈ స్కీమ్ కు సంబంధించిన అర్హులను గుర్తించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది.
భూమి లేని నిరుపేద కూలీల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ను జనవరి 26వ తేదీన ప్రారంభించాలని కూడా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో… అసలైన అర్హులను గుర్తించే పనిలో పడింది. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి వివరాలను సేకరించనున్నారు.
ఈ స్కీమ్ లో అర్హుల ఎంపిక కీలకంగా మారింది. ఓవైపు రైతు భరోసా స్కీమ్ ద్వారా పంట పెట్టుబడి సాయం అందించాలని సర్కార్ నిర్ణయించింది. రైతు భరోసాలో ఉండే లబ్ధిదారులకు ఈ స్కీమ్ వర్తింపజేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూమిలేని కూలీలనే ఈ పథకానికి ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది. గ్రామసభల ద్వారా ఫైనల్ చేసి అర్హుల జాబితాను రూపొందించాలని సూచించింది. అయితే ఈ స్కీమ్ ద్వారా ఎవరిని అర్హులుగా గుర్తిస్తారు..? ఎలాంటి అంశాలను ప్రతిపాదికగా తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది…!
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ - ముఖ్యమైన అంశాలు
- భూమిలేని నిరుపేద కూలీల కోసం తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ అత్మీయ భరోసా’ స్కీమ్ ను ప్రకటిచింది.
- ఇందిరమ్మ అత్మీయ భరోసా పేరుతో ప్రతి ఏటా రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందించటం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం. రైతు భరోసా కింద లేని కూలీలను ఈ స్కీమ్ కు ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల ఎంపికలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వివరాలు కీలకంగా మారనున్నాయి.
- ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సుమారుగా 10 లక్షల మందికిపైగా కూలీలు అర్హులు ఉంటారని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఈ అంచనాలు ప్రాథమికంగా ఉన్నప్పటికీ… అధికారుల క్షేత్రస్థాయి సర్వే తర్వాత తుది వివరాలను ప్రకటించనున్నారు.
- ఈ స్కీమ్ కు ఎంపిక కావాలంటే.. సదరు వ్యక్తిపై ఎలాంటి రకమైన భూమి ఉండొద్దు. ఏడాదిలో కనీసంగా 20 రోజులైన ఉపాధి హామీ పనులు చేసిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సర్కార్ ప్రాథమికంగా నిర్ణయించింది.
- ఈ స్కీమ్ కు అర్హులను ఎంపిక చేసేందుకు ఇప్పటికే అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసింది. ఈ టీమ్స్ గ్రామాల్లో పర్యటిస్తాయి.
- ఉపాధి హామీ కార్డుల ఆధారంగా… రైతు కూలీ కుటుంబ వివరాలను పరిశీలిస్తారు. ప్రాథమికంగా గుర్తించే పేర్లను గ్రామసభ ముందు ఉంచుతారు. ఈ వివరాలను సమావేశంలో చదివి వినిపిస్తారు.
- గ్రామసభలో ప్రకటించే పేర్లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. వీటిని అన్ని కోణాల్లో పరిష్కరించి.. అధికారులు తుది జాబితాను సిద్ధం చేస్తారు. అర్హులైన వారికి రెండు దశలలో రూ.12 వేల ఆర్థిక సాయం పొందుతారు.
- ఈ స్కీమ్ కోసం అర్హులను గుర్తించేందుకు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో జనవరి 21 నుండి 24వ తేదీ వరకు గ్రామసభ నిర్వహిస్తారు. అందులో లబ్ధిదారుల ముసాయిదా జాబితాను చదివి వినిపిస్తారు. అనంతరం అర్హుల తుది జాబితాను ఆమోదిస్తారు.
- ఇటీవలనే రైతు భరోసా స్కీమ్ కోసం అధికారికంగా మార్గదర్శకాలు విడుదల కాగా.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి గైడ్ లైన్స్ విడుదల కావాల్సి ఉంటుంది.
- గుంట భూమి ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం సరికాదని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చెబుతోంది. రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24.57 లక్షల మంది ఉన్నారని… కోతలు లేకుండా రైతు కూలీలందరికీ 12 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
సంబంధిత కథనం