Suryapet crime: సూర్యాపేటలో ఘోరం.. కుమార్తెతో కన్నతండ్రి అసభ్య ప్రవర్తన,కొట్టి చంపిన ఇద్దరు భార్యలు
Suryapet crime: సూర్యాపేట జిల్లా గుర్రంతండాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నబిడ్డపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఇద్దరు భార్యలు కలిసి కొట్టి చంపేశారు. మద్యం మత్తులో కుమార్తెపై కన్నేసి అసభ్యంగా ప్రవర్తించడాన్ని సహించలేక చంపేసినట్టు పోలీసులకు తెలిపారు.
Suryapet crime: సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కన్న బిడ్డపైనే కన్నేసిన కామాంధుడు భార్యల చేతిలో ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. అక్కాచెల్లెళ్లైన మృతుడి భార్యలు ఈ హత్య చేయడం కలకలం రేపింది.

సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం గుర్రంతండా సోమవారం తెల్లవారు జామున రత్నావత్ సైదులు హత్యకు గురయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గుర్రం తండాకు చెందిన రత్నావత్ సైదులు (40) కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 2003లో నకిరేకల్ మండలం కోడూరు గ్రామానికి చెందిన రమ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రమ్య డెలివరీకి వెళ్లిన సమయంలో ఇంటికి వచ్చిన ఆమె చెల్లెలు సుమలతను కూడా సైదులు శారీరకంగా లోబర్చుకుని గర్భవతిని చేయడంతో 2013లో ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు. సైదులు- సుమలత దంపతులకు ఒక కుమారుడు సంతానం ఉన్నాడు. రెండు కుటుంబాు గుర్రం తండాలోనే ఉంటున్నాయి.
సైదులు- రమ్య దంపతుల చిన్న కుమార్తె ఆరునెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. పెద్ద కుమార్తె హైదరాబాద్ లోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతోంది. సంక్రాంతి పండుగకు సెలవులు రావడంతో వారి కుమార్తె స్వగ్రామానికి వచ్చింది. తండ్రి సైదులు ఆదివారం కూతుర్ని సూర్యాపేటకు షాపింగ్‌కు తీసుకెళ్లి దుస్తులు కొన్నాడు.
ఇంటికి వచ్చిన తర్వాత కొత్త దుస్తులు మార్చుకుంటున్న సమయంలో కుమార్తెతో సైదులు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె జరిగిన విషయం తల్లికి చెప్పింది. ఆ సమయంలో భర్తతో రమ్య గొడవపడింది. జరిగిన విషయాన్ని చెల్లెలుతో చెప్పి వాపోయింది.
ఆదివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన సైదులు.. సోమవారం తెల్లవారు జామున ఇంట్లో నిద్రిస్తున్న పెద్ద కుమార్తెతో మరోసారి అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె తల్లిని నిద్ర లేపి జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆవేశానికి గురైన రమ్య, ఆమె చెల్లెలు సుమలతలు రోకలిబండతో సైదులు తలపై కొట్టారు. గొంతు పిసికి హత్య చేశారు. అనంతరం స్థానికులకు విషయం చెప్పారు. సమాచారం తెలుసుకున్న సూర్యాపేట డీఎస్సీ రవి, సీఐ నాగరా జు. ఎస్ఐ వి. మహేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.