Hyderabad Brutal Murder: హైదరాబాద్‌లో ఘోరం.. ఇన్‌స్టా ప్రేమ పెళ్లి, ఆపై అనుమానంతో భార్య దారుణ హత్య
Hyderabad Brutal Murder: హైదరాబాద్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి దారుణ హత్యకు గురైంది. ఇన్‌స్టాలో పరిచయమైన ఓ జంట మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆపై కుటుంబ పోషణ పట్టించుకోక పోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. భార్యపై అనుమానంతో 7నెలల గర్భిణీని అత్యంత కిరాతకంగా హతమార్చాడు
Hyderabad Brutal Murder: హైదరాబాద్‌లో అత్యంత అమానవీయంగా యువతి హత్యకు గురైంది. నిండు గర్భంతో ఉన్న భార్య కడుపుపై కూర్చొని ఊపిరాడకుండా చేసి భర్త హతమార్చాడు. ఈ ఘటనలో కడుపులో నుంచి బయటకొచ్చిన శిశువు కూడా మృతి చెందడం అందరిని కలిచి వేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ బిడ్డకు కూడా జన్మించాడు. పెళ్లి తర్వాత బాధ్యతలు బరువయ్యాయి. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ లోపు ఆ జంటకు ఓ బిడ్డ కూడా పుట్టాడు. డబ్బు కోసం కొడుకును అమ్మేయాలని చూడటంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్నాళ్లు కలిసి ఉంటూ, మరికొన్నాళ్లు విడిపోతూ కాపురం సాగింది. భార్య గర్భంతో ఉండటంతో అనుమానించి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనలో శిశువు కూడా ప్రాణాలు కోల్పోయింది.
హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. మొదట అనుమానాస్పద మరణంగా భావించినా పోలీసుల దర్యాప్తులో హత్యగా నిర్ధారించారు. జనవరి 16న హత్య జరగ్గా మూడ్రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతితో పాటు నెలలు నిండని శిశువును దారుణంగా హత్య చేసినట్టు గుర్తించారు.
కాచిగూడకు చెందిన అతిపాముల సచిన్ సత్యనారాయణకురెండేళ్ల క్రితం ఇన్‌స్టా గ్రామ్‌లో కాప్రాకు చెందిన స్నేహతో పరిచయం ఏర్పడింది. 2022లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొత్తలో సచిన్ ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేసేవాడు. 2023లో ఓ బాబు జన్మించాడు. పెళ్లి తర్వాత సచిన్ పని మానేసి జులాయిగా తిరగడంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో వాటి నుంచి బయట పడటానికి బిడ్డను పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తికి అమ్మాలనుకుని రూ.లక్షకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు.
ఆ విషయం తెలుసుకున్న స్నేహ కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విక్రయించిన బిడ్డను స్వాధీనం చేసుకుని తిరిగి వారికి అప్పగించారు. ఆ తర్వాత కొన్ని నెలలకు బాలుడు మృతిచెందాడు. ఇలా వరుస వివాదాలు, గొడవలతో భార్యాభర్తలు కొన్ని నెలలుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో కాప్రాలో ఓ గది అద్దెకు తీసుకుని గత ఏడాది డిసెంబరు 11 నుంచి మళ్లీ కలిసి ఉంటున్నారు.
ఇటీవల భార్య స్నేహ 7 నెలల గర్భంతో ఉన్నట్లు తెలియడంతో సచిన్ గర్భం ఎలా వచ్చిందని ఆమెను వేధిస్తున్నాడు. ఆమె సర్ది చెబుతున్నా వినకుండా స్నేహను మట్టుపెట్టాలని వ్యూహరచన చేశాడు.
పథకం ప్రకారం జనవరి 15వ తేదీ రాత్రి భార్యకు మద్యం తాగించాడు. 16వ తేదీ ఉదయం5 గంటల సమయంలో నిద్రలో ఉన్న భార్య కడుపుపై కూర్చుని దిండును ఆమె ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. పొట్టపై కూర్చోవడంతో కడుపులో ఉన్న బిడ్డ కూడా బయటకొచ్చి చనిపోయింది.
హత్యలు చేసిన తర్వాత ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. గ్యాస్ సిలిండర్ లీక్ చేసి ఇంట్లో నుంచి బయటకు పారిపోయాడు. సిలిండర్‌లో గ్యాస్ అయిపోవడంతో ప్లాన్ వర్కౌట్ కాలేదు. జనవరి 18న గది నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి భర్తపై అనుమానంతో సచిన్ కోసం గాలించారు. కాచిగూడలో ఉన్న నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఘటన వెలుగు చూసింది.