Kothagudem Airport : తాజా బడ్జెట్‌లో కేంద్రం కీలక ప్రకటన.. కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై పెరుగుతున్న ఆశలు!-hopes raised for the construction of a greenfield airport in kothagudem ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kothagudem Airport : తాజా బడ్జెట్‌లో కేంద్రం కీలక ప్రకటన.. కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై పెరుగుతున్న ఆశలు!

Kothagudem Airport : తాజా బడ్జెట్‌లో కేంద్రం కీలక ప్రకటన.. కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై పెరుగుతున్న ఆశలు!

Basani Shiva Kumar HT Telugu
Feb 04, 2025 12:17 PM IST

Kothagudem Airport : కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. ఇటు కేంద్రం కూడా కొత్తగా 120 విమానాశ్రయాలు నిర్మిస్తామని ప్రకటించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్తగూడెం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడుగులు పడే అవకాశం ఉంది.

కొత్తగూడెం ఎయిర్‌పోర్టు
కొత్తగూడెం ఎయిర్‌పోర్టు (istockphoto)

దేశవ్యాప్తంగా 120 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయబోతున్నట్టు.. తాజా బడ్జెట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. దీంతో కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ఆశలు బలపడుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే దీని నిర్మాణానికి అడుగులు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు స్థల పరిశీలనకు తెలంగాణ ప్రభుత్వం రూ.38లక్షలు మంజూరు చేసింది. ఇటీవలే టెక్నో ఎకనామిక్‌ ఫీజిబిలిటీ సర్వే పూర్తయ్యింది.

2.కొత్తగూడెం జిల్లా కేంద్రానికి సమీపంలోని రామవరం- గరీబ్‌పేట గ్రామాల మధ్య ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం భూమిని కేటాయించింది. చుంచుపల్లి, కొత్తగూడెం, సుజాతనగర్‌ మండలాల్లో ఈ ప్రాంతం విస్తరించి ఉంది.

3.ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలాన్ని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు ఇటీవల పరిశీలించారు. కేంద్ర బృందం పర్యటనతో ఈ ప్రాంత వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

4.గతంలో కూడా ఈ ప్రాంతంలోని లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడుచెలక, పాల్వంచ మండలం గుడిపాడు- బంగారుజాల మధ్య ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు పలుమార్లు సర్వే చేశారు. కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు.

5.ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వం 954 ఎకరాలు కేటాయించింది. దీంట్లో కేవలం 200 ఎకరాలు మాత్రమే ప్రజల నుంచి తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మిగతాది ప్రభుత్వ భూమే అని వివరిస్తున్నారు.

6.ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవరోధాలు లేవు. ముఖ్యంగా చెరువులు, కుంటలు, గుట్టలు వంటివి లేకపోవటం కలిసొచ్చే అంశం అని జిల్లా అధికారులు చెబుతున్నారు.

7.తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రాంతం నాలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఉంది. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, సారపాక తదితర పారిశ్రామిక ప్రాంతాలకు ఎయిర్‌పోర్టు నిర్మాణంతో రాకపోకలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

8.సుజాతనగర్‌ మండలంలో 197, కొత్తగూడెంలో 750, చుంచుపల్లి మండలంలో 7 ఎకరాలను ప్రభుత్వం విమానాశ్రయానికి కేటాయించింది. తెలంగాణలో ఆరు రీజినల్‌ ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

9.కొత్తగూడెం గ్రీన్‌ఫీల్ట్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. భద్రాచలం పుణ్యక్షేత్రానికి దేశ నలుమూలల నుంచి భక్తులు రావటానికి ఈ విమానాశ్రయం ఉపయోగపడుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.

Whats_app_banner