సొంత రాష్ట్రానికి బదిలీ అయ్యిందని సంతోషించే లోపు…కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ కుటుంబాన్ని కబళించిన రోడ్డు ప్రమాదం-hometown transfer happiness cut short road accident kills bank managers family ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  సొంత రాష్ట్రానికి బదిలీ అయ్యిందని సంతోషించే లోపు…కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ కుటుంబాన్ని కబళించిన రోడ్డు ప్రమాదం

సొంత రాష్ట్రానికి బదిలీ అయ్యిందని సంతోషించే లోపు…కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ కుటుంబాన్ని కబళించిన రోడ్డు ప్రమాదం

Sarath Chandra.B HT Telugu

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని గద్వాలకు చెందిన కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ కుటుంబం మృత్యువాత పడింది. ఇటీవల జరిగిన బదిలీల్లో విజయపుర నుంచి తెలంగాణకు బదిలీ అయిన సంతోషంలో ఉన్న కుటుంబం.. దైవ దర్శనం కోసం వెళుతుండగా జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బ్యాంక్ మేనేజర్‌ కుటుంబం

సొంత రాష్ట్రానికి బదిలీ కావాలని మూడేళ్లకు పైగా ఎదురు చూశారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించి కర్ణాటక నుంచి తెలంగాణకు బదిలీ అయ్యింది. సంతోషంతో కుటుంబ మొత్తం దైవ దర్శనానికి వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. వారిలో కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ కుటుంబం ప్రాణాలు కోల్పోయారు.

కర్ణాటకలోని విజయపుర జిల్లా బసవనబాగేవాడి తాలూకా మనగోళి సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వారిని గద్వాల జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో బ్యాంక్‌ మేనేజర్‌ భాస్కర్‌ కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

గద్వాల జిల్లాకు చెందిన టి.భాస్కర్ మొదట గద్వాల కెనరా బ్యాంకులో విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ప్రమోషన్‌పై మేనేజర్‌ హోదాలో కర్ణాటకలోని విజయపురకు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయనకు హైదరాబాద్ బ్రాంచీకి బదిలీ చేశారు.

మూడేళ్లకు పైగా కర్ణాటకలో ఉన్న భాస్కర్‌ కుటుంబం సొంత రాష్ట్రానికి బదిలీ కావడంతో కుటుంబంతో దైవ దర్శనం చేసుకునేందుకు బయలుదేరారు. బుధవారం ఉత్తర కన్నడ జిల్లాలోని మురుడేశ్వర్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

సోలాపుర - చిత్రదుర్గ జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌ 50)పై భాస్కర్‌ కుటుంబం ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొంది. అదుపు తప్పిన లారీ తొలుత కారు ముందు ఉన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఆ తర్వాత అదే లారీ భాస్కర్ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో భాస్కర్ తోపాటు ఆయన భార్య పవిత్ర, కుమార్తె జ్యోత్స్న (12), కుమారుడు అభిరామ్ (14), కారు డ్రైవర్ విజయపుర జిల్లా హెుర్తికి చెందిన వికాశ శివప్ప మకని, ట్రావెల్స్ బస్సు డ్రైవర్ బసవరాజ రాథోడ్ ప్రమాద స్థలంలోనే మరణించారు.

తీవ్రంగా గాయపడిన భాస్కర్ మరో కుమారుడు ప్రవీణ్ తేజ, లారీ డ్రైవర్ చెన్నబసు సిధ్ధప్పలను విజయపుర జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాద వార్త తెలియడంతో భాస్కర్ సోదరులు కర్ణాటక బయలుదేరి వెళ్లారు. మృత దేహాలను గద్వాల తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం