TG Police Home Guards : హోంగార్డులకు తీపి కబురు - జీతాల పెంపుపై ప్రకటన, జనవరి నుంచే అమలు!
హోంగార్డులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించారు.దినసరి వేతాన్ని రూ.921 నుంచి రూ.1000కి, వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను నెలకు రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాలు జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా హోంగార్డులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పారు. వారి జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం జనవరి నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.
ఎస్‌డీఆర్‌ఎఫ్(స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్) లోగోతో పాటు కొత్త వాహనాలను శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… హోం గార్డుల దినసరి వేతనాన్ని రూ.921 నుంచి రూ.1000 కి పెంచుతున్నట్లు ప్రకటించారు.
వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను నెలకు రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హోంగార్డులు ఎవరైనా విధి నిర్వహణలో చనిపోతే రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. ఆరోగ్యశ్రీలో హెల్త్ కార్డులు జారీ చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
పోలీసుల పిల్లల చదువుల కోసం డీజీపీ నుండి హోంగార్డు పిల్లల వరకు ఒకే స్కూల్లో చదువుకునే లాగా ప్రత్యేక స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కార్పొరేట్ స్థాయి స్కూళ్లకు ధీటుగా పోలీస్ స్కూళ్లను ప్రారంభిస్తామని చెప్పారు. 50 ఎకరాల్లో ఈ స్కూల్ నిర్మాణం ఉంటుందన్నారు. పోలీస్ పిల్లలకు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరికేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ స్కూల్ అంటే ప్రత్యేకమైన గుర్తింపునిచ్చేలా కృషి చేస్తామని చెప్పుకొచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం:
"గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను నిరోధించడంలో కొంత ప్రగతి సాధించినప్పటికీ ప్రస్తుత చర్యలు సరిపోవు. మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.
డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ వంటి కేసుల్లో న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు పడే విధంగా స్పెషల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి సుశిక్షితులైన అధికారులను నియమించాలి. ఈ కేసుల కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం.
హైదరాబాద్ నగరంలో ప్రధానంగా కాలుష్యం తగ్గించడం, ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన అవసరం ఎంతో ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాన్స్ జెండర్లు అడుక్కునే దృశ్యాలను గమనించి, వారు ఆత్మగౌరవంతో బతకడానికి, జనజీవన స్రవంతిలో చేర్చాలన్న ఉద్దేశంతో ట్రాఫిక్ అసిస్టెంట్స్‌గా విధుల్లోకి తీసుకోవడం జరిగింది. సమాజంలో వారు వివక్షకు గురికావొద్దు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న పోలీసు ఉన్నతోద్యోగులకు పరిహారం చెల్లిస్తున్నట్టుగానే, హాం గార్డులు ఎవరైనా ప్రమాదవ శాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయించాం.
సమాజానికి ఎన్నో సేవలు అందిస్తున్న పోలీసు ఉద్యోగం అంటే మీకు ఉపాధి కాదు. ఇదొక భావోద్వేగం. ప్రభుత్వ ప్రతిష్టను కాపాడే బాధ్యత మీపైన ఉంది. ప్రెండ్లీ పోలీసు అంటే... బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. బాధితులు, అన్యాయానికి గురైన వారి పట్ల గౌరవంగా వ్యవహరించాలి. కబ్జాలు, హత్యలు, ఆర్థిక నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలి. నేరగాళ్లకు ప్రొటోకాల్ పాటిస్తే మీరు మీ విధులను నిర్వర్తించలేరు.
సమాజంలో ఎక్కువ సేవలు అందిస్తున్నది పోలీసులే. అలాగే ఎక్కువ విమర్శలు ఎదుర్కోనేది కూడా పోలీసులే. యూనిఫామ్ ఫోర్స్ అంటే క్రమశిక్షణతో ఉండాలి. మీకేవైనా సమస్యలు ఉంటే వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజల సమస్యలను పరిష్కరించే మీకు సమస్యలు ఉండొద్దు" అని ముఖ్యమంత్రి చెప్పారు.