Bomb Threat Call : ఫ్లయిట్ కి లేట్ అయిందని.. విమానంలో బాంబు ఉందని బెదిరించాడు !-hoax bomb threat call at hyderabad rgi international airport ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hoax Bomb Threat Call At Hyderabad Rgi International Airport

Bomb Threat Call : ఫ్లయిట్ కి లేట్ అయిందని.. విమానంలో బాంబు ఉందని బెదిరించాడు !

HT Telugu Desk HT Telugu
Feb 20, 2023 06:52 PM IST

Bomb Threat Call : తాను వెళ్లాల్సిన విమానాన్ని సమయానికి అందుకోలేనని భావించిన ఓ ప్రబుద్ధుడు... ఫ్లయిట్ లో బాంబు ఉందని ఫోన్ కాల్ చేసి బెదిరించాడు. అప్రమత్తమైన అధికారులు, ఫ్లయిట్ ని పూర్తిగా తనిఖీ చేసి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని నిర్ధారించుకున్నారు. ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి... అదుపులోకి తీసుకున్నారు. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఈ ఘటన... హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు (PTI)

Bomb Threat Call : అంతర్జాతీయ, దేశీయ విమానాల రాకపోకలు.. ప్రయాణికులతో నిత్యం బిజీగా ఉండే హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో... సోమవారం కలకలం రేగింది. అత్యంత భద్రత.. నిరంతర నిఘా మధ్య ఉండే ఎయిర్ పోర్ట్.. ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హై సెక్యూరిటీ ఉండే.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి.. బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్ - చెన్నై విమానంలో బాంబు పెట్టామంటూ ఓ దుండగుడు ఫోన్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు... ప్రయాణికులని దించేసి విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహించారు. ప్యాసెంజర్ క్యాబిన్, లగేజీ క్యాబిన్ సహా ప్లేన్ మొత్తం జల్లెడ పట్టారు. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు లేకపోవడంతో... అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు కాల్ ఉత్తదేనని... కావాలనే ఫేక్ కాల్ చేశారని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

హైదరాబాద్ - చెన్నై ఫ్లయిట్ లో బాంబు లేదని నిర్ధారించుకున్న తర్వాత.. అధికారులు ఫోన్ చేసిన నంబర్ పై దృష్టి సారించారు. బాంబు బెదిరింపు కాల్ వచ్చిన నంబర్ పై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. కాల్ ఎక్కడి నుంచి వచ్చింది... ఎవరు చేశారు అనే అంశాలపై దర్యాప్తు చేశారు. ఈ మేరకు తీగలాగగా... అసలు విషయం తెలిసి అధికారులు ఖంగుతిన్నారు. హైదరాబాద్ - చెన్నై విమానంలో బాంబు ఉందని ఫోన్ చేసింది... అదే విమానంలో ప్రయాణించాల్సిన ఓ ప్రయాణికుడని తెలుసుకొని.. ఆశ్చర్యపోయారు. అజ్మీరా భద్రయ్య అనే వ్యక్తి ఈ కాల్ చేసినట్లు తేల్చారు. అయితే... ఇలా ఫేక్ కాల్ చేయడానికి గల కారణం తెలుసుకుని... ఎయిర్ పోర్టు సిబ్బంది, ఇంటెలిజెన్స్ అధికారులు.. అవాక్కయ్యారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..... అజ్మీరా భద్రయ్య అనే వ్యక్తి .. చెన్నై వెళ్లాలని అనుకున్నాడు. ఇందుకోసం చెన్నై విమానానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే... సమయానికి ఎయిర్ పోర్టుకి రాలేకపోయాడు. ఆలస్యం కావడంతో... చెన్నై విమానాన్ని అందుకోలేనేమో అని అనుకున్నాడు. ఫ్లయిట్ లో బాంబు ఉందని బెదిరింపు కాల్ చేశాడు. ఇలా చేస్తే... విమానాన్ని తనిఖీ చేస్తారని, ఆ సమయంలోగా ఫ్లయిట్ ని అందుకోవచ్చని భావించాడు. ఈ సమాచారంతో... అప్రమత్తమైన అధికారులు, ఫ్లయిట్ ని పూర్తిగా తనిఖీ చేసి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని నిర్ధారించుకున్నారు. ఫోన్ కాల్ పై విచారణ జరిపి... బెదిరింపు కాల్ చేసింది అజ్మీరా భద్రయ్య అని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఎయిర్ పోర్ట్ పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు.

IPL_Entry_Point