తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ఓరుగల్లు నగరం. కాకతీయుల రాజధానిగా వెలుగొందిన ఈ నగరం.. చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు, గొలుసుకట్టు చెరువులు, శిల్ప కళా వైభవానికి నిదర్శనం.
ఎన్నో అద్భుత కట్టడాలు, అబ్బురపరిచే శిల్ప కళా సంపదకు నిలయమైన ఓరుగల్లు ఖ్యాతి మరోసారి ప్రపంచ వ్యాప్తం కానుంది.
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే 57 మంది ప్రపంచ అందగత్తెలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనుండగా, ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అందులో వివిధ దేశాల నుంచి తరలివస్తున్న ముద్దుగమ్మలు 35 మంది హనుమకొండలోని వేయి స్తంభాల గుడి, వరంగల్ లోని కోట, మరో 22 మంది ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ.. జరూర్ ఆనా’అనే థీమ్‌తో ప్రణాళిక రచించింది. అంతగత్తెల పర్యటనతో ఓరుగల్లు చరిత్ర, చారిత్రక కట్టడాల నేపథ్యం మరోసారి ప్రపంచ దేశాల్లో ప్రాచుర్యం పొందనున్నాయి.
హనుమకొండలోని వేయి స్తంభాల గుడి (రుద్రేశ్వర స్వామి ఆలయం) కాకతీయ వంశ రాజుల శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. వెయ్యి స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేరింది.
ఈ గుడిని క్రీ.శ 1,163లో కాకతీయ రాజు రుద్రదేవుడు చాళుక్యుల శైలిలో నిర్మించాడు. ఇందులో కాకతీయుల శిల్పకళా వైభవం స్పష్టంగా కనిపిస్తుంది. నక్షత్రాకార పీఠంపై నిర్మించిన ఈ త్రికూటాలయం అద్భుతమైన వాస్తుకళను కలిగి ఉంది. ఆలయం కల్యాణ మంటపం, ప్రధాన ఆలయంతో కలిపి సుమారు వేయి స్తంభాలతో దీనిని నిర్మించగా.. 2005–06లో భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కల్యాణ మండప పునర్నిర్మాణ పనులు చేపట్టారు.
దాదాపు 17 ఏళ్ల పాటు పనులు కొనసాగగా.. 2024లో కల్యాణ మంటపం తిరిగి వినియోగంలోకి వచ్చింది. కాగా ఈ ఆలయం తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను, చరిత్ర పరిశోధకులను అమితంగా ఆకర్షిస్తోంది.
వరంగల్ కోట కాకతీయుల కాలంలో నిర్మితమైన ఒక ఇతిహాసిక దుర్గం. ఇది దీనిని రాజధానిగా చేసుకుని కాకతీయులు పాలన కొనసాగించారు. కాకతీయ రాజైన ప్రోల రాజు ఈ కోట నిర్మాణానికి పునాది వేశారని ప్రచారంలో ఉంది. గణపతి దేవుడు, రుద్రమ దేవి, ప్రతాపరుద్రుడు తదితర రాజులు ఈ కోటను మరింత బలోపేతం చేశారని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు.
శత్రు దుర్భేద్యంగా, అద్భుత కళా సంపదతో ఈ కోటను నిర్మించారు. కోటలోని మూడు వృత్తాకార వలయాలు, నాలుగు భారీ రాతి ద్వారాలు (కీర్తి తోరణాలు), స్వయంభూ శివాలయం వంటివి కాకతీయుల నిర్మాణ వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ కోటను ఒక ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ స్థలంగా గుర్తించి, దాని పరిరక్షణ.. పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. కాకతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు కాకతీయ వైభవ సప్తాహం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
వరంగల్ కోటలోని కాకతీయ కళా తోరణం (కీర్తి తోరణం) తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో కూడా స్థానం పొందింది. ఈ తోరణం కాకతీయుల నిర్మాణ కళాత్మకతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. తద్వారా తెలంగాణ సాంస్కృతిక గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని కాకతీయ రాజైన గణపతి దేవుడి సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు 13వ శతాబ్దంలో నిర్మించగా.. రామప్ప అనే శిల్పి పేరు మీదుగా ఈ ఆలయానికి రామప్ప అనే పేరు వచ్చింది. ఆలయంలో రామలింగేశ్వర కొలువుదీరగా.. ఎత్తైన నక్షత్ర ఆకారపు పీఠంపై తూర్పు దిశా ముఖంగా దీనిని నిర్మించారు.
ఇప్పటికే దేశ, విదేశాల నుంచి పర్యాటకులు తరలి వస్తుండగా, జులై 25 2021న రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది. ఈ గుర్తింపు కోసం 255 కట్టడాలు పోటీపడగా, 17 దేశాల ప్రతినిధులు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో రామప్పకు యునెస్కో వారసత్వ హోదా దక్కింది.
ఓరుగల్లులోని అద్భుతమైన ఆలయాలు, పర్యాటక ప్రాంతాల అందాలను తిలకించేందుకు ప్రపంచ అందగత్తెలు బుధవారం తరలిరానుండగా, వరంగల్ కీర్తి ప్రతిష్టలు మరోసారి ప్రపంచ వ్యాప్తం కానున్నాయి. ప్రపంచ ముందుగుమ్మల పర్యటనకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేయగా.. చారిత్రక కళాసంపదను వీక్షించి, వారంతా ముగ్ధులవుతారని ఆఫీసర్లు అంటున్నారు. మరి ఓరుగల్లు అందాలకు ప్రపంచ సుందరీమణుల ఎలాంటి కితాబు ఇస్తారో చూడాలి.
(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం