Warangal Crime : పూజల పేరుతో హిజ్రా ఘరానా మోసం.. రూ.55 లక్షలతో పరార్!
Warangal Crime : ఇంట్లో దోషాలు తొలగించి శుభం జరిగేలా చేస్తామంటూ.. పూజల పేరుతో ఓ హిజ్రా ఘరానా మోసానికి పాల్పడింది. ఓ మహిళ నుంచి రెండు విడతలలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసింది. రూ.55 లక్షల వరకు వసూలు చేసింది. మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సత్య నారాయణపురానికి చెందిన ట్రాన్స్ జెండర్ నాగదేవి.. ఇండ్లల్లో దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తూ వివిధ రకాల పూజలు చేస్తుంటుంది. భక్తులు ఇచ్చే దక్షిణతో కాలం వెళ్లదీసేది. ఈ క్రమంలో నాగదేవికి ఓ మహిళ ద్వారా జనగామ పట్టణంలోని వెంకన్న కుంటకు చెందిన ఉప్పల సిరివెన్నెలతో పరిచయం ఏర్పడింది.
పూజలతో టోకరా..
సిరివెన్నెల తన ఇంట్లో ఏ పని చేసినా కలిసి రావడం లేదని నాగదేవికి చెప్పింది. సిరివెన్నెల ఇంటితో పాటు ఇతర వ్యవహారాలు గమనించిన నాగదేవీ.. ఎలాగైనా ఎంతో కొంత డబ్బు దండుకోవాలని పథకం రచించింది. ఇంట్లో మంచి జరగాలంటే ప్రత్యేక పూజలు చేయాలని, అలా చేస్తే అంతా కలిసి వస్తుందని నమ్మి బలికింది. దోషాలు కూడా అన్నీ తొలగిపోయి ఇంట్లో మంచి జరుగుతుందని చెప్పింది.
ఆ పూజలు చేయడానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని నమ్మించింది. పూజ సామాగ్రి, పూజ చేసినందుకు డబ్బు అవసరమని చెప్పి, సిరివెన్నెల నుంచి హిజ్రా నాగదేవి మొదటి దఫాలో రూ.15 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు మరో రూ.40 లక్షలు తీసుకుంది. ఏవేవో పూజలు చేస్తున్నట్టు నటించి అక్కడి నుంచి ఉడాయించింది.
సిరివెన్నెల ఇంట్లో పూజలు చేసినా పరిస్థితులు మారకపోవడంతో బాధితురాలు పలుమార్లు నాగదేవిని ఫోన్‌లో సంప్రదించింది. ఆమె ఏదో ఒక సమాధానం చెబుతూ కాలం వెళ్లదీస్తూ వచ్చింది. లక్షలు ఖర్చు చేసినా తమ జీవితంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో చివరకు నాగదేవిని సిరివెన్నెల కుటుంబం నిలదీసింది.
నాగదేవి నుంచి సరైన సమాధానం రాకపోగా.. పలుమార్లు ఫోన్‌లో సంప్రదించడంతో ఆమె మొబైల్ స్విచ్చాఫ్ చేసేసింది. తాను మోసపోయానని గ్రహించిన సిరివెన్నెల రెండు రోజుల కిందట జనగామ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
బీరప్పగడ్డలో..
నాగదేవిపై జనగామ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిన తర్వాత మరో ఘటన వెలుగులోకి వచ్చింది. జనగామ పట్టణంలోని బీరప్పగడ్డ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని కూడా ఇలా మోసం చేసినట్లుగా తెలిసింది. ఇంట్లో దోషాలు తొలగిస్తామని పూజల పేరుతో అతడి నుంచి రూ.15 లక్షలు వసూలు చేసినట్లుగా సమాచారం. ఈ ఘటనపై బాధితుడి పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేసినట్టు తెల్సింది. ఇంట్లో మంచి జరుగుతుందంటూ ఎవరైనా పూజల పేరున మోసాలకు పాల్పడినట్టు తెలిస్తే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ జిల్లా ప్రతినిధి)