Telangana Assembly : చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తున్నా.. అసెంబ్లీలో హరీష్ రావు స్పీచ్ హైలైట్స్-highlights of brs leader harish rao speech in telangana assembly ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Assembly : చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తున్నా.. అసెంబ్లీలో హరీష్ రావు స్పీచ్ హైలైట్స్

Telangana Assembly : చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తున్నా.. అసెంబ్లీలో హరీష్ రావు స్పీచ్ హైలైట్స్

Telangana Assembly : బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో సాధారణ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీమంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారిందని ఎద్దేవా చేశారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో మాట్లాడుతున్న హరీష్ రావు

రైతులందరికీ రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కను చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తున్నా.. అని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. నది దాటేదాక ఓడ మల్లయ్య.. దాటిన తరువాత బోడ మల్లయ్య అనే సామెత కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా వర్తిస్తుందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల పాలనలో ఒక్క రూపాయి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయలేదని వ్యాఖ్యానించారు.

వీపులు పగలగొడుతున్నారు..

'కరోనా కాలంలోనూ మేం ఫీజు రూ.18,500 కోట్లు రీయింబర్స్‌మెంట్ ఇచ్చాం. సంస్కారానికి ఆస్కార్ అవార్డు ఉంటే అది రేవంత్ రెడ్డికే వస్తది. రేవంత్ రెడ్డి ప్రసంగం మార్చురీ కంపు కొడుతోంది. ప్రజలు వినలేకపోతున్నారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారింది. జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడిగితే అశోక్ నగర్‌లో నిరుద్యోగుల వీపులు పగలగొడుతున్నారు. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా?' అని హరీష్ రావు ప్రశ్నించారు.

భూములు ఖతం..

'అనుముల వారి పాలనలో ఎన్ని భూములు ఖతం పట్టిస్తారో తెలియదు. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముని వేలం చేయడం ద్వారా రూ.30 వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు చేశారు.. ఎన్నికలు అయ్యాక ఆ వాగ్దానాలను ఏమార్చారు. ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు.. ఇప్పుడు ఏమో ఎల్ఆర్ఎస్ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు' అని హరీష్ రావు విమర్శలు గుప్పించారు.

అప్పుడలా.. ఇప్పుడిలా..

'ఆ రోజు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తుంటే.. అక్కడ భట్టి విక్రమార్క, సీతక్క పాదయాత్ర చేసి భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఇప్పుడేమో ఇంకా 14 వేల ఎకరాలు లాక్కుంటాం అంటున్నారు. ఆ రోజు మేము ప్రభుత్వ భూములు అమ్మితే.. ప్రభుత్వ భూముల ఎలా అమ్ముతారు అన్నారు.. ఈ రోజు బరాబర్ భూములు అమ్ముతాము అంటున్నారు. ఇదేం పద్ధతి..' అని హరీష్ రావు నిలదీశారు.

హరీష్‌కు కౌంటర్..

'ఇదెక్కడి న్యాయం అధ్యక్షా.. రేవంత్ రెడ్డి బట్టలూడదీసి కొడతా అంటే ఏం అనలేదు. నేను బుద్ధి మాంద్యం అంటే అభ్యంతరం తెలపడం కరెక్టా అధ్యక్షా' అని హరీష్ రావు ప్రశ్నించారు. 'మా సీఎంకు జ్ఞానం లేదు అని హరీష్ రావు అనడం ఎంతవరకు సబబు' అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. 'సత్య దూరమైన మాటలు మాట్లాడుతుంటే.. కాంగ్రెస్ వాళ్లు చూస్తూ ఊరుకుంటారా. యావత్ తెలంగాణ ప్రజానీకం చూస్తుంది. కొంచెం వాస్తవాలు మాట్లాడండి' అంటూ హరీష్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం