KU Registrar: కేయూ రిజిస్ట్రార్‌పై విచారణకు ఉన్నత విద్యామండలి ఆదేశాలు, అసోసియేట్ ప్రొఫెసర్ నియామకంపై వివాదం-higher education council orders inquiry against ku registrar dispute over appointment of associate professor ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ku Registrar: కేయూ రిజిస్ట్రార్‌పై విచారణకు ఉన్నత విద్యామండలి ఆదేశాలు, అసోసియేట్ ప్రొఫెసర్ నియామకంపై వివాదం

KU Registrar: కేయూ రిజిస్ట్రార్‌పై విచారణకు ఉన్నత విద్యామండలి ఆదేశాలు, అసోసియేట్ ప్రొఫెసర్ నియామకంపై వివాదం

Sarath chandra.B HT Telugu
Aug 15, 2024 06:05 AM IST

KU Registrar: కాకతీయ యూనివర్సిటీ ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొ.మల్లారెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్ గా నియామకంపై విచారణ జరపాల్సిందిగా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నుంచి కేయూ ఇన్ఛార్జ్ వీసీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకంపై ఫిర్యాదుల నేపథ్యంలో విచారణకు ఆదేశించారు.

కాకతీయ వర్శిటీ రిజిస్ట్రార్‌పై విచారణకు ఉన్నత విద్యామండలి ఆదేశం
కాకతీయ వర్శిటీ రిజిస్ట్రార్‌పై విచారణకు ఉన్నత విద్యామండలి ఆదేశం

KU Registrar: కాకతీయ యూనివర్సిటీ ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొ.మల్లారెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్ గా నియామకంపై విచారణ జరపాల్సిందిగా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నుంచి కేయూ ఇన్ఛార్జ్ వీసీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సరైన అనుభవం లేకున్నా.. అప్పటి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని ఫిర్యాదులు అందాయి.

మల్లారెడ్డిని అసోసియేట్ ప్రొఫెసర్ గా నియమించారంటూ హనుమకొండకు చెందిన కేఎన్ రెడ్డి అనే వ్యక్తి దాదాపు 15 రోజుల కిందట చీఫ్ సెక్రటరీతో పాటు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి వెంటనే నివేదిక పంపాల్సిందిగా ప్రస్తుత ఇన్ఛార్జ్ వీసీకి ఉత్తర్వులు (నెం.1457/UE/A2/2024) జారీ చేశారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుభవం లేకుండానే...?

ప్రొఫెసర్ మల్లా రెడ్డి గణితంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. కాగా నోటిఫికేషన్ తేదీ నాటికి ప్రొఫెసర్ పి.మల్లా రెడ్డికి నిబంధనల ప్రకారం అసోసియేట్ ప్రొఫెసర్‌కు అవసరమైన అర్హతలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నోటిఫికేషన్ నం. 04/2006, UGC నిబంధనలు-1998 ప్రకారం G.O.Ms.No ద్వారా అసోసియేట్ ప్రొఫెసర్‌కి నేరుగా రిక్రూట్‌మెంట్ కోసం మల్లారెడ్డికి అవసరమైన అర్హత లేదని సమాచారం.

పరిశోధన డిగ్రీలు పొందేందుకు వెచ్చించిన వ్యవధిని మినహాయించి బోధన, లేదా పరిశోధనలో ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న వారు మాత్రమే అసోసియేట్ ప్రొఫెసర్ గా అర్హులు అని ఉన్నప్పటికీ అప్పటి అధికారులు అదంతా పట్టించుకోకుండా మల్లారెడ్డిని అసోసియేట్ ప్రొఫెసర్ గా నియామకం చేశారని కేఎన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

విచారణాదేశాలతో గందరగోళం..

ప్రొఫెసర్ మల్లారెడ్డి విషయంపై 25/6/2024న కేఎన్ రెడ్డి కేయూ వీసీ, హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినా పెద్దగా స్పందన లేకుండా పోయింది. దీంతోనే జులై 29, 30 తేదీల్లో కేఎన్ రెడ్డి మరోసారి ఫిర్యాదు చేశారు. వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి అక్రమ నియామకంపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి ఇన్ఛార్జ్ వీసీకి విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో కాకతీయ యూనివర్సిటీలో తీవ్ర చర్చ జరుగుతోంది.

గతంలో వీసీ నియామకంపైనా వివాదం

కాకతీయ యూనివర్సిటీలో ఇదివరకు వీసీ నియామకంపైనా వివాదం చెలరేగింది. వీసీగా పని చేసిన ప్రొఫెసర్ తాటికొండ రమేష్ కు ప్రొఫెసర్ గా పదేళ్ల అనుభవం లేకుండా వైస్ ఛాన్స్ లర్ గా నియమించడం పట్ల వివాదం మొదలైంది. వీసీగా ప్రొఫెసర్ తాటికొండ నియామకం అయిన తొలి నాళ్లలోనే ఈ వివాదం తెర మీదకు రాగా, ఈ విషయంపై ఒకరు హై కోర్టుకు వెళ్లగా.. మరొకరు లోకాయుక్తను ఆశ్రయించారు.

కాగా ఆ వివాదంలో తీర్పు వెలువడక ముందే వీసీల పదవీకాలం ముగిసి ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్ నియామకంపై వివాదం తెర మీదకు రాగా, ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)