Karimnagar : పోషకాహార లోపం... బలహీనంగా బాల్యం! ఆందోళన కలిగిస్తున్న లెక్కలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చిన్నారుల్లో పోషకాహార లోపం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు… ఆరేళ్లలోపు పిల్లలను రక్తహీనత వేధిస్తోంది. అవగాహన లోపంతో గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం లేకపోవటంతో పాటు బాల్య వివాహాలతో చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం వంటివి ఇందుకు కారణమవుతున్నాయి.
మొక్కకు నీరు పోసి సంరక్షిస్తేనే ఎదుగుతుంది.. పంటకు నీటితో పాటు సరైన మోతాదులో ఎరువు వేస్తేనే మంచి దిగుబడి వస్తుంది. పిల్లలకు అది అక్షరాలా వర్తిస్తుంది. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చిన్నారుల్లో పోషకాహార లోపం ఆందోళన కలిగిస్తోంది. ఆరేళ్లలోపు పిల్లలను రక్తహీనత వేధిస్తోంది. చిన్నారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్న మార్పు కనిపించడం లేదు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆరేళ్ళ లోపు 1 లక్షా 79 వేల 510 మంది పిల్లలు ఉండగా తక్కువ బరువు గలవారు 9464 మంది ఉన్నారు. అతి తక్కువ బరువు గలవారు 1409 మంది, తీవ్ర పోషణ లోపంతో ఉన్న వారు 3691 మంది ఉన్నారు. అతి తీవ్ర పోషణ లోపంతో 552 మంది ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
చిన్నారులు ఆరోగ్యంగా ఎత్తుకు తగ్గ బరువు పెరగాలంటే పోషకాహారం అవసరం. ఎదిగే వయసులో పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు సమతుల ఆహారం అందించాలి. కానీ చాలామంది పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లేమి తదితర కారణాలతో పిల్లలకు పోషకాహారం ఇవ్వలేకపోతున్నారు. దీంతో చిన్నారులు వయసుకు తగ్గ ఎత్తు, బరువు ఉండటం లేదు.
నామమాత్రమే అవుతున్న పథకాలు...!
మహిళలు గర్భం దాల్చిన నుంచి పిల్లలకు ఆరేళ్ళ వయసు వచ్చే వరకు ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాయి. పిల్లలు పుట్టిన ఏడు నెలల నుంచి మూడేళ్ల వరకు బాలామృతం, నెలకు 16 కోడిగుడ్లు ఇస్తున్నారు. 3 నుంచి 6 ఏళ్లలోపు వారికి భోజనం, నెలకు 30 ఉడికించిన కోడిగుడ్లను అంగన్వాడీ కేంద్రాల్లో అందజేస్తున్నారు.
పోషకాహారంతో బాధపడుతున్న వారికి బాలామృతం ప్లస్ పంపిణీ చేస్తున్నారు. కానీ ఈ కార్యక్రమం క్షేత్ర స్థాయిలో నామమాత్రంగా అమలవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల భోజనం ఉడకడంలేదనే ఆరోపణలున్నాయి. పర్యవేలోపంతో కొన్ని కేంద్రాల్లో సరకులు పక్కదారి పడుతున్నాయి. పిల్లల ఎదుగుదల, ఆహార నిల్వలు, గర్భిణులు, బాలింతల టీకాల వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో నిక్షిప్తం చేస్తున్నారు.
శుక్రవారం సభతో చైతన్యం...
బాల్యం బలహీనంగా ఉండకుండా గర్బం దాల్చినప్పటి నుంచే తల్లులు పౌష్టికాహారం తీసుకునేలా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలో శుక్రవారం సభతో చైతన్యం చేస్తున్నారు. ప్రతి శుక్రవారం అంగన్ వాడి కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి పౌష్టికాహారం ప్రాముఖ్యత గురించి వివరిస్తు చిన్నారుల వయసును బట్టి ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా అవగాహన కల్పిస్తున్నారు.
తల్లులకు పిల్లలకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు పౌష్టికాహారం అందిస్తున్నారు. చిన్నారుల ఎదుగుదలపై పర్యవేక్షిస్తూ.. నెలవారీగా వివరాలు నమోదు చేస్తున్నారు. శుక్రవారం సభకు మహిళలు వచ్చి అన్ని వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో బాలహీనం నుంచి బాల్యం బయటపడుతున్నప్పటికి ఇతర ప్రాంతాల్లో మాత్రం పిల్లల పరిస్థితి కలవరపరుస్తుంది.
తల్లిపాలే రక్ష…
అప్పుడే పుట్టిన పిల్లలకు ఆరు నెలల పాటు తల్లిపాలు ఇవ్వాలని పిల్లల వైద్య నిపుణులు అంటున్నారు. ఏడాది తర్వాత పోషకాలు, విటమిన్లు ఉండే ఆహారం పెట్టాలని సూచిస్తున్నారు. చిన్నారులకు ఉదయం సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్తలు తీసుకోవాలని, దాంతో డి విటమిన్ లభించి వారి ఎముకలు బలంగా తయారవుతాయని అంటున్నారు. పోషకాహారంతో వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుందని చెబుతున్నారు.
- అవగాహన లోపంతో గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం లేదు.
- బాల్య వివాహాలతో చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం.
- నెలలు నిండకుండానే ప్రసవించడంతో తల్లిబిడ్డలు అనారోగ్యాల పాలవుతున్నారు..
- అంగన్వాడీ, వైద్య ఆరోగ్యశాఖల మధ్య సమన్వయ లోపంతో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం లేదు.
- బాలామృతం ప్లస్ ను పిల్లలకు ఇవ్వడంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం.
ఇలా చేస్తే మేలు.…
- చిన్నారులకు ఇంట్లో చిరుధాన్యాలతో చేసిన ఆహారం ఇవ్వడంతో పాటు బెల్లం, పల్లీలు, నువ్వులతో తయారు చేసిన వంటకాలు అందించాలి.
- పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసం, తాజా ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు తినేలా ప్రోత్సహించాలి.
- పిల్లలు బరువు తక్కువగా ఉంటే వైద్యుల సలహాలు పాటించాలి. తల్లిదండ్రులు పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన పెంచుకోవాలి.
- బాలామృతం ప్లస్ ను తీవ్ర పోషకాహార లోపంతో బాధ పడుతున్న పిల్లలకు రెండు సార్లు తినిపించాలి. ఆదేవిదంగా పాలు, కోడిగుడ్లు అందించాలి.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం