Hyderabad Vijayawada Highway : హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్.. పల్లె బాటపడుతున్న నగర వాసులు
Hyderabad Vijayawada Highway : హైదరాబాద్ నగర వాసులు పల్లెల బాట పడుతున్నారు. దీంతో నగరం అంతా నిర్మానుష్యంగా మారింది. వాహనాల రద్దీ బాగా తగ్గింది. ఇటు హైదరాబాద్ వెలుపల రద్దీ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్- విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దసరా సందర్భంగా నగర వాసులు పల్లె బాటపడుతున్నారు. దీంతో చౌటుప్పల్ దగ్గర ట్రాఫిక్ భారీగా స్తంభించింది. టోల్‌ప్లాజాల దగ్గర వాహనాలు బారులు తీరాయి. నెమ్మదిగా నడుస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలతో టోల్ ప్లాజాలు రద్దీగా మారాయి. ఇటు హదరాబాద్ నగరం బోసిపోయింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
వాహనాల రద్దీ కారణంగా.. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం లోని కార్లపాడు గ్రామం దగ్గర విజయవాడ వైపునకు వెళ్లే మార్గంలో ఆరు టోల్ బూతులను సిద్ధం చేశారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ (విఐపీ, అంబులెన్స్) కోసం ఏడవ టోల్ బూత్‌ను ఏర్పాటు చేశారు. వాహనల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి బూత్‌ను ఏర్పాటు చేసినట్టు టోల్ ప్లాజా సిబ్బంది వివరించారు.
అటు నల్గొండ జిల్లా చిట్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీపై ఉన్న డీజిల్ ట్యాంకర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోగా.. లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
ఇటు హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపైనా వాహనాల రద్దీ నెలకొంది. ఘట్‌కేసర్ ఓఆర్ఆర్ క్రాసింగ్, యాదాద్రి టోల్ ప్లాజా, రఘునాథపల్లి టోల్ గేట్ దగ్గర వాహనాల రద్దీ నెలకొంది. టోల్ ప్లాజాల సిబ్బంది దగ్గరుండి వాహనాలు వేగంగా కదిలేలా చర్యలు చేపట్టారు. హైవేపై పోలీసులు నిరంతరం తిరుగుతూ.. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
దసరా సందర్భంగా ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ నేపథ్యంలో ప్రయాణ సమయం వృథా కాకుండా శివారు ప్రాంతాల నుంచి ఈ బస్సులు నడుపుతోంది. మహాలక్ష్మి పథకం అమలుతో గత ఏడాదితో పోల్చితే ప్రయాణికుల రద్దీ ఎక్కువయ్యింది. అందుకు తగిన ఏర్పాట్లను ఆర్టీసీ చేసింది. బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో.. ప్రజలకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా యాజమాన్యం ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఇవి ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్‌నగర్, కేపీహెచ్‌బీ తదితర శివారు ప్రాంతాల నుంచి అందుబాటులో ఉంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం.. షామియానాలు, కుర్చీలు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చుతున్నారు.