Adilabad Beauty : ఆదిలాబాద్ జిల్లాలో మంచు అందాల కనువిందు.. రైతులకు ఇబ్బందులు
Adilabad Beauty : ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి అందాకు నిలయం. పచ్చని చెట్లు, జలపాతాలు, దట్టమైన అడవులు, పక్షుల కిలాకిలా రావాలతో అలరారుతూ ఉంటుంది. శీతాకాలంలో కశ్మీర్‌ను తలపించే అందాలు ఆదిలాబాద్ సొంతం. ఈ అందాలకు ఇప్పుడు మంచు తోడయింది. పొగమంచు కనువిందు చేస్తోంది.
ఆదిలాబాద్ జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. జిల్లా వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురుస్తోంది. కశ్మీర్ వాతావరణం కనిపిస్తోందని ఆదిలాబాద్ ప్రజలు చెబుతున్నారు. ఉదయం 9 గంటలు దాటినప్పటికీ పొగమంచు పోవడం లేదు. గతంలో ఎప్పుడు చూడని విధంగా మంచు కురుస్తుండటంతో.. వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
కొన్ని మండలాలల్లో అసాధారణ రీతిలో మంచు కురుస్తోంది. ఉత్తర సహాయాద్రి కొండలు ఉన్న వాంకిడి ఘాట్ రోడ్డులో ఉదయం 8 వరకు దట్టంగా మంచు కురిసింది. ఈ మంచు కారణంగా అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. మిరప, పెసరు, కంది వంటి వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పొగ మంచు ఎక్కువగా కురుస్తుండడంతో.. తాము తీవ్రంగా నష్టపోతామని మిరప రైతులు చెబుతున్నారు. మిరప, కంది పంటలను అధికశాతం మంది రైతులు సాగు చేస్తున్నారు. ఇది పూతకు అనుకూలమైన సమయం. ఈ టైంలో పొగమంచు కారణంగా.. పేను బంక, పురుగు, ఆకు ముడత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని వాపోతున్నారు.
ఈ సమస్యల కారణంగా పంటల దిగుబడి సగానికి పడిపో అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పగటిపూట మబ్బుల ప్రభావం ఉండడంతో చీడపీడలు మరింత ఎక్కువ అవుతాయని రైతులు అంటున్నారు.
వణికిపోతున్నారు..
ఉదయం, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. దీంతో జిల్లావాసులు వణికిపోతున్నారు. గత పది రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం 8 గంటలైనా భానుడి దర్శనం ఉండడం లేదు. సాయంత్రం 5 గంటల నుంచే చల్ల గాలులు వణికిస్తున్నాయి. ప్రజలు బయటకు రావాలంటనే జంకుతున్నారు. రెండు రోజులుగా చలిగాలుల తీవ్రత మరింత పెరిగింది.
(రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)