Hyderabad Traffic : పల్లెబాట పట్టిన భాగ్యనగరం….జాతీయ రహదారుల కిటకిట
Hyderabad Traffic సంక్రాంతి పండుగకు భాగ్య నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సొంతూళ్లకు బయలు దేరడంతో నగరంలోని రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్‌లో స్థిర పడిన ప్రజలు పెద్ద సంఖ్యలో స్వస్థలాలకు బయలుదేరడంతో రోడ్లపై రద్దీ తగ్గిపోయింది. అదే సమయంలో విజయవాడ వైపు వెళ‌్ళే జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరడంతో టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.
Hyderabad Trafficసంక్రాంతి పండుగుకు సొంతూళ్లకు వెళ్లడంతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ గణనీయంగా తగ్గిపోయింది. పండుగకు రెండ్రోజుల ముందే జనం సొంతూళ్లకు బయలుదేదారు. దీంతో జాతీయ రహదారులు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్-విజయవాడ మార్గంలో వేలాది వాహనాలు బారులు తీరాయి. గురువారం నుంచి ట్రాఫిక్ రద్దీ పెరిగింది. పంతంగి టోల్ గేటు వద్ద కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ నిలిచిపోయింది.
పండుగ ప్రయాణాల కోసం జాతీయ రహదారులపై వాహనాలు బారులు తీరడంతో వాటిని క్రమబద్దీకరించేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్, పంతంగి టోల్ గేటు వద్ద రెండు కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచి ఉన్నాయి. టోల్ గేటు వద్ద ఉన్న 16 గేట్లలో 11 గేట్ల నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. కేవలం ఐదు గేట్లలో మాత్రమే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు వస్తున్నాయి. ప్రయాణికుల వాహనాల సంఖ్య నామమాత్రంగా ఉన్నాయి. రవాణా వాహనాలు, ఆర్టీసి వాహనాలు మాత్రమే హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్నాయి. కొద్ది సంఖ్యలో మాత్రమే సాధారణ ప్రయాణికుల వాహనాలు హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయమవాడ వైపు కిలోమీటర్ల పొడవున వాహనాలు బారులు తీరాయి.
సంక్రాంతి ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు, ఆర్టీసి బస్టాండ్‌లు కిటకిట లాడుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు రైల్వే శాఖ 300 ప్రత్యేక రైళ్లను నడిపింది. వీటితో నిత్యం నడిచే 278 సాధారణ రైళ్లలో కూడా రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రత్యేక రైళ్లు ప్రకటించినా వాటిలో రద్దీ ఏమాత్రం తగ్గలేదు. సికింద్రాబాద్, నాంపల్లి, లింగం పల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి లక్షలాది మంది ప్రయాణించారు. ఆర్టీసి బస్సులతో పాటు ప్రత్యేక బస్సుల్ని వేల సంఖ్యలో ఏర్పాటు చేశారు. రైళ్లలో ముందస్తు లేకుండా ప్రయాణించేందుకు వీల్లేకుండా పోయింది. జనరల్ బోగీల సంఖ్య తగ్గడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సాధారణ రోజులతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. హైదరా బాద్‌లో నివసించే ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా మీదుగా బుధవారం ఒక్కరోజే 42వేల వాహనాలు రాకపోకలు సాగించాయి. వీటిలో సుమారు 30వేల వరకు కార్లు ఉంటాయని టోల్‌ప్లాజా నిర్వాహకులు చెబుతున్నారు. గురువారం అర్ధరాత్రికల్లా విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య అరలక్ష దాటవచ్చని అంచనా వేశారు. విద్యాసంస్థలకు శుక్రవారం నుంచి సెలవులు కావడంతో వాహనాల రద్దీ మరింత పెరిగిపోయింది. సాధారణ రోజుల్లో ఈ టోల్‌ప్లాజా మీదుగా 31-32 వేల వాహనాలు వెళతాయి. శుక్రవాం లక్షకు చేరువలో వాహనాలు ప్రయాణిస్తాయని అంచనా వేస్తున్ారు.