ద్రోణి ప్రభావం - ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..! ఈ ప్రాంతాలకు ఎల్లో హెచ్చరికలు-heavy rains likely in ap and telangana for another two days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ద్రోణి ప్రభావం - ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..! ఈ ప్రాంతాలకు ఎల్లో హెచ్చరికలు

ద్రోణి ప్రభావం - ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..! ఈ ప్రాంతాలకు ఎల్లో హెచ్చరికలు

ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది. ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి….

ఏపీకి భారీ వర్ష సూచన (image source @APSDMA)

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. ఓవైపు ఉక్కపోత ఉంటున్నప్పటికీ… మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో… మరో రెండు రోజుల పాటు చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలను జారీ చేసింది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం… రాష్ట్రంలో రెండు రోజులపాటు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇవాళ(జూన్ 12) పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

తెలంగాణ వెదర్ రిపోర్ట్:

ఇక తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం... ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చు.

రేపు(జూన్ 13) నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చు. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చు. గంటలకు 40 - 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఎల్లుండి(జూన్ 14) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.