తెలంగాణలో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. ఓవైపు ఎండల తీవ్రత తగ్గగా… మరోవైపు వాతవరణం క్రమంగా చల్లబడుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురవగా… మరో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.
రాబోయే 2 రోజుల్లో కేరళలోకి రుతుపవనాలు ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు కేరళ, తమిళనాడు, ఉత్తర భారతంలోని మరికొన్ని ప్రాంతాలపైకి రుతుపవనాలు మరింత ముందుకు సాగే పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని పేర్కొంది.
మరోవైపు మే 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య మరియు దానిని అనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఈ ప్రభావంతో తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణలో ఈ ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు లేదా ఈదురుగాలులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ వివరాల ప్రకారం…. ఇవాళ(మే 23) ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు(మే 24) నిర్మల్, నిజామాబాజ్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది 40- 50 కి,మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. వీటితో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మే 27వ తేదీ వరకు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ తర్వాత కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని పేర్కొంది. భారీ వర్షాల సూచనతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి.
సంబంధిత కథనం