వేసవి వేళ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో… ఇవాళ ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడ్డాయి. మంచిర్యాల, కొమురంభీం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వానలు పడగా… పలుచోట్ల వడగళ్లు కురిశాయి.
మంచిర్యాల లక్షేట్టిపేట మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన పడింది. ఇక కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో పలు చోట్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం పడింది. దీంతో ఆలయ పరిసరాల్లో భారీగా వరద నీరు పారింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కుండపోత వర్షం కురిసింది. అకాల వర్షాలతో పంట నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ వర్షాలతో రైతులు… ఆందోళన చెందుతున్నారు.
ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉంది. తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను ఇచ్చారు.
ఇక రేపు (మార్చి 22వ తేదీన) కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతారవణ కేంద్రం అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
మార్చి 23వ తేదీన పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మార్చి 24వ తేదీ నుంచి మళ్లీ పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఓవైపు ఎండలు…. మరోవైపు వర్ష సూచన ఉండటంతో తెలంగాణలో భిన్న వాతావరణం కనిపించే అవకాశం ఉంది.